గురు పూర్ణిమ, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పవిత్రమైన పండుగ. ఈ రోజున వ్యాసముని, అంటే కృష్ణ ద్వైపాయనుడు, ఉత్తరాషాఢ నక్షత్రంలో అవతరించారు. అందుకే ఈ దినాన్ని ‘వ్యాస పూర్ణిమ’ అని కూడా పిలుస్తారు. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, గురువు పట్ల మన ఆదరణ, అంకితభావం, గౌరవాన్ని తెలియజేసే గొప్ప వేడుక. చాతుర్మాస్య వ్రతం కూడా ఈ రోజే ఆరంభమవుతుంది.
‘గురువు’ అనే పదంలో, ‘గు’ అంటే అజ్ఞానం, ‘రు’ అంటే ఆ అజ్ఞానాన్ని నాశనం చేసే వ్యక్తి అని అర్థం. అంటే, గురువు అజ్ఞానాంధకారం నుంచి మనల్ని జ్ఞాన దివ్యత్వం వైపు నడిపించే అత్యంత జ్ఞాన సంపన్నుడు. పూర్వం విద్యార్థులంతా గురువుగారి ఆశ్రమంలోనే ఉంటూ ఉచితంగా విద్యను అభ్యసించేవారు. గురువుగారి ప్రతి మాటను శిష్యులు ఆజ్ఞగా స్వీకరించేవారని చరిత్రలో అనేక నిదర్శనాలు ఉన్నాయి.
నిజమైన గురువును గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఆయన మన జీవిత పరమార్థాన్ని గూర్చి జ్ఞానాన్ని అందించగలరు. గురువు సచ్చిదానంద స్వరూపుడైన భగవంతునితో సమానం. ఒక ప్రామాణిక గురువు బ్రహ్మనిష్ఠ గల శిష్య పరంపరకు చెందినవారై ఉండాలి. ‘శ్రోత్రియం’ అంటే ఒక ప్రామాణిక గురు-శిష్య పరంపరకు చెందినవారై, శాస్త్రజ్ఞానంలో నిష్ణాతులై ఉండాలి. వేదాలు, వైదిక సాహిత్యంపై ఆయనకు సంపూర్ణ జ్ఞానం ఉండాలి. ముఖ్యంగా, గురువుకు ఒక గురువు ఉండాలి, ఆ గురువుకు ఒక గురువు ఉండాలి, ఈ పరంపర శ్రీకృష్ణుడి నుంచి మొదలై ఉండాలి. శ్రీకృష్ణుడే ఆదిగురువు. గురువు తన సొంత కల్పనలను కలపకుండా, తన పూర్వాచార్యుల నుంచి విన్నది యథాతథంగా పునరుద్ఘాటించాలి.
గురువు ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ కలిగిన ‘గోస్వామి’ అయి ఉండాలి, కేవలం ఇంద్రియాల బానిస (గోదాస) కారాదు. గురువు తాను భగవంతుడని ఎప్పుడూ చెప్పుకోకూడదు. అలా చెప్పుకొంటే బోధకుడిగా అనర్హుడవుతారు. ఆయన శిష్యులను భగవంతునికి శరణాగతి చేయమని ప్రోత్సహిస్తారు, కానీ వారిలో అహంకారాన్ని పెంచరు. కేవలం డబ్బు కోసం మంత్రాలను అమ్మే నకిలీ గురువులను నమ్మవద్దు. నిజమైన గురువు, శ్రీల ప్రభుపాదుల వలె, హరినామ మహామంత్రాన్ని ఉచితంగా పంచిపెడతారు. గురువు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడిని ముందుంచి, తాను వెనకుండి, శ్రీకృష్ణుని శరణాగతికై మార్గనిర్దేశం గావిస్తారు.
గురువుల బాధ్యత తమ శిష్యులను అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించడం. బద్ధ జీవులను వారి పరిమిత ఆలోచన దృక్పథాల నుంచి బయటకు లాగి, వారి జ్ఞాన పరిధిని విస్తరింపజేస్తారు. దీక్షా గురువు మాయను భగ్నం చేసి, కృష్ణ చైతన్యం పట్ల బలమైన కోరికను నాటుతాడు. తన సేవతో గురువును సంతృప్తిపరచడమే శిష్యుడి ప్రధాన విధి. జీవితంలోని సవాళ్లు, ఆటుపోట్లు, ఆరోగ్య సమస్యలు, బలహీనతలలో మునిగిపోకుండా, ఆధ్యాత్మిక గురువు అభీష్ట సాకారానికి తగిన సేవ చేయడంలో నిమగ్నమై ఉండాలి. ‘గురువు ఆదేశాలను చిత్తశుద్ధితో, నిబద్ధతతో పాటించేవాడు నాకు అత్యంత ప్రియమైనవాడని’ శ్రీకృష్ణుడే వివరించాడు.
మన జీవితంలోని సవాళ్లు ఏవైనా ఉన్నప్పటికీ, గురువు ఆదేశాలను నిబద్ధతతో పాటించడానికి ప్రయత్నించాలి. అలసత్వాన్ని విడిచిపెట్టాలి. సేవ చేయకుండా, ప్రచారం చేయకుండా ఆపేది ఏదైనా మాయే. మనం అర్హత లేనివారిగా భావించినప్పటికీ, గురువు ఆదేశాన్ని పాటించడం శుద్ధిని ఇస్తుంది. గురువు ఆదేశం లభించినప్పుడు, ఎక్కువగా లెక్కించకుండా, వెంటనే దాన్ని ఆచరించాలి. భగవంతుడు, గురువు పట్ల గల శరణాగతి భావమే మానవ జన్మ సాఫల్యానికి మార్గం.
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, 96400 86664