విద్యాం చావిద్యాం చ యస్త ద్వేదోభయం సహ
అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృత మశ్నుతే॥
కర్మ, ఉపాసన… రెండూ ఆచరించదగినవే! కర్మచేత మృత్యువును జయిస్తాడు. ఉపాసనతో దివ్యత్వాన్ని పొందుతాడు. అవిద్య అంటే కర్మ. విద్య అంటే ఉపాసన. కర్మ ఎక్కువ శాతం శారీరకం. ఉపాసన మానసికం. కర్మచేత పరతత్వాన్ని పొందలేం. దానినే నిష్కామ కర్మగా మలుచుకుంటే ఉపాసనకు సహకరిస్తుంది. పరతత్వాన్ని చేరుస్తుంది. గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రతం ఇలాంటిదే! ఆమె మనసంతా కృష్ణుడితోనే నిండి ఉన్నది. అదే ఉపాసన. కానీ, ఆమె కర్మను మానలేదు. వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో నెల రోజులు ఆచరించడమే కాకుండా చెలికత్తెలతోనూ ఆచరింపజేసింది. ఇదే నిష్కామ కర్మ. అంటే పరతత్వానికి మరింత సన్నిహితం చేసింది. గోదాదేవి భూదేవి అంశ. ఆమె సాధకురాలు కాదు. కానీ, సామాన్య సాధకులకు మార్గదర్శకంగా వ్రతాన్ని ఆచరించి చూపించింది.
లోకంలో ఏ కాంతకైనా ప్రియుడు భగవంతుడు కాడు. గోదాదేవి ప్రియుడు మాత్రం భగవంతుడే! అదే విశేషం. మరో విశేషం.. గోదాదేవికి వ్రతాన్ని ఏ గురువూ ఉపదేశించలేదు. రుగ్వేదంలో కాత్యాయని అంటే పార్వతి పరమేశ్వరుడి కోసం ధనుర్మాస వ్రతం చేసిందని చెబుతారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కోసం గోపికలు వ్రతాన్ని ఆచరించారు. కలియుగంలో విష్ణుచిత్తుడు (పెరియాళ్వారు) భాగవతం దశమ స్కంధం ప్రవచనం చేసేవారు. అదంతా కృష్ణ కథే! గోదాదేవి అప్పుడప్పుడు వినేది. అదీగాక ఇంటికి తరచుగా వేంచేసే వైష్ణవోత్తములను సేవించేది. వారు గోపికల వృత్తాంతాన్ని చర్చించేవారు. గోదాదేవి అవన్నీ వింటూ ప్రేరణ పొందింది. గోపికల వ్రతంలాగా తిరుప్పావై అనే పాశురాలు రోజుకొక్కటిగా 30 రోజులు పాడి, పూమాలగా స్వామికి సమర్పించుకున్నది. ఆమెకు శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్రశాయే శ్రీకృష్ణుడు, ఆలయమే నందగోప భవనం, తానున్న పల్లెనే వ్రేపల్లె, చెలికత్తెలే గోపికలు. అలా తన్మయురాలై వ్రతాన్ని ఆచరించి, ఆచరింపజేసి, తరించి, తరింపజేసింది.