ఆయన రూపంలో ఓ సందేశం కనిపిస్తుంది. ఆయన చేతల్లో ఓ ప్రత్యేకత దర్శనమిస్తుంది.అందుకే మంత్రశాస్త్రం గణపతిని వివిధ రీతుల్లో వర్ణించింది. సృష్టికి మూలమైన గణపతి.. మూలాధారంలో కొలువై ఉండి మనకు రక్షణ కల్పిస్తుంటాడు. విఘ్నాలకు విరుగుడు పలికే వినాయకుణ్ని తలుచుకున్నంతనే అజ్ఞానం తొలగిపోతుంది.
వినాయకుడు పూర్ణసృష్టికి సంకేతం. గణపతిది అతి గొప్ప ఆధ్యాత్మిక తత్వమని శాస్ర్తాలు, ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. యోగ గణపతిగా ఆయన ప్రాధాన్యాన్ని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతున్నది.
‘త్వం మూలాధారే స్థితోస్మి నిత్యమ్…
త్వం యోగినో ధ్యాయంతి నిత్యమ్’
‘మానవ శరీరంలోని మూలాధార స్థానంలో ఉండే దైవానివి నీవే… యోగులందరూ ఎప్పుడూ నిన్నే ధ్యానిస్తూ ఉంటార’ని గణపతి అధర్వశీర్షం చెబుతుంది. యోగశాస్త్రంలో వినాయకుడిని మూలాధార చక్రానికి అధిష్ఠాన దేవతగా భావిస్తారు. మూలాధారం దగ్గర సుషుమ్న నాడి మూడు చుట్టలు చుట్టుకుని, పైన పడగ కప్పుకొని ఉన్న పాములా ఉంటుందని పతంజలి వెల్లడించారు. యోగి తన సాధన ద్వారా సుషుమ్నను మేల్కొలుపుతాడు. దీంతో మిగిలిన అయిదు చక్రాలూ ఉత్తేజితం అవుతాయి. ఈ క్రియ వల్ల హంసలా మనిషిలో సంచరించే ప్రాణవాయువు సహస్రార కమలాన్ని చేరుకుంటుంది. అప్పుడు ఆత్మ పరమాత్మ ఏకమవుతాయి. ఈ యోగప్రక్రియ మొత్తానికి సూత్రం మూలాధారం. ఆ చక్రానికి అధిష్ఠానదేవత గణపతి.
గజ వదనం ఓంకారాన్ని సూచిస్తుంది. ‘అ’కారం నుంచి ‘క్ష’కారం వరకు ఉన్న అక్షరాలను కంఠం మొదలు చరణాల వరకు వివిధ అంగాలుగా భావించిన మన మహర్షులు ‘అక్షర గణపతి’ని ఆవిష్కరించారు. అక్షర స్వరూపమైన గణపతిని ఆరాధించడం అంటే అక్షరాల్ని ఉపాసించటమే అవుతుంది. అక్షరం అంటే నాశనం కానిది అని అర్థం. నాశనం లేనిది జ్ఞానం ఒక్కటే. గణపతి ఉపాసన అంటే జ్ఞానాన్ని ఉపాసించటమే! మన శరీరంలో సుషుమ్నతో పాటు ఇడ, పింగళ అనే నాడులు ఉంటాయి.
వీటిలో ‘ఇడ’ బుద్ధికి, ‘పింగళ’ సిద్ధికి సంకేతాలు. సుషుమ్న ఎప్పుడూ ఇడ, పింగళతో కలిసే ఉంటుంది. అంటే, మూలాధార అధిపతి అయిన గణపతి సిద్ధి, బుద్ధితో కలిసి ఉంటాడన్నమాట. గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలు అనడంలో అంతరార్థం కూడా ఇదే! మనలో ఉన్న దురాలోచనలు తొలిగితే మంచి బుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో మనసు శాశ్వతమైన ముక్తిస్థానాన్ని కోరుకుంటుంది. గణపతి ఆరాధన ద్వారా మంచి బుద్ధి వస్తుంది. మోక్షం వైపు మనిషి సాధన జరుగుతుంది. గణపతి ఉపాసనలోని అంతరార్థం, ఆయన తత్వం ఇదే!
మహాభారతాన్ని రాసే నేర్పు గణపతికే ఉందని భావించాడు. గణపతి కూడా సరేనన్నాడు. అయితే, వ్యాసుడు ‘నేను చెప్పే ప్రతి శ్లోకాన్నీ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే రాయాల’ని నియమం పెట్టాడు. వ్యాసుడు చెబుతూనే ఉన్నాడు. గణపతి రాస్తూనే ఉన్నాడు. ప్రతి శ్లోకాన్నీ పూర్తిగా అర్థం చేసుకుంటూ ఏకబిగిన రాసేశాడు. అలా పంచమ వేదమైన మహాభారతం ఆవిర్భవించింది. అద్భుతాలు జరగాలంటే ఏమరుపాటు పనికిరాదు. గొప్ప సన్నద్ధత, దృఢదీక్ష కావాలి. పనులు ప్రారంభించాక వచ్చే ఆటంకాలు చూసి బెదరిపోకూడదు. చివరదాకా పట్టుదలగా నిలవాలి. అప్పుడే విజయం వరిస్తుంది. విద్యార్థులకు ఉండాల్సిన ఈ లక్షణాలన్నిటినీ గణపతి ఆచరణాత్మకంగా అందించాడు.
ఆకాశం నుంచి వాయువు, అందులో నుంచి అగ్ని, దాని నుంచి నీరు, నీటి నుంచి భూమి ఏర్పడ్డాయి. జడ పదార్థమైన భూమి, చైతన్యం కలిగిన నీటితో కలిసి ప్రాణశక్తిని పొందుతుంది. ఆహార పదార్థాలు, ఓషధులు అందిస్తుంది. ఇలా ప్రాణ, జడశక్తుల కలయికతో సృష్టి సాగుతుందనడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారుచేస్తారు. మట్టి గణపతిని పూజించడం, ఆ తర్వాత నిమజ్జనం చేయడం ఉత్తమ ఆచారంగా చెబుతారు.
గణపతిని త్రిగుణాలకు అతీతుడుగా, త్రికాలాలకు (భూత, భవిష్యత్, వర్తమాన) అందనివాడుగా, పంచభూతాలకు ఆత్మగా, సకల దేవతా స్వరూపుడిగా అధర్వణ వేదంలోని గణపతి అధర్వ శీర్షం ప్రకటిస్తుంది. త్రిమూర్తులు సహా పంచభూతాలూ ఆయన స్వరూపమే అంటుందీ స్తోత్రం. ‘ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ వరదమూర్తయే నమః’ … గణపతి అధర్వ శీర్షంలో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రపాఠం ఇది. స్తోత్రరూపంగా సాగే ఈ అధర్వశీర్ష పారాయణ వేగంగా ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.
‘ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన సృణ్వన్నూతిభిస్సీదసాదనం’ గణపతిని పూజించే మంత్రాల్లో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రం ఇది. రుగ్వేదం రెండో మండలంలో ఇది ఉంది. గణపతిని రాజుల్లో పెద్దవాడుగా, దేవతల్లో పూజలందుకునే మొదటివాడుగా, 33 కోట్ల దేవతాగణాలకు అధినాయకుడిగా వర్ణిస్తుంది రుగ్వేదం. గణాలకు నాయకుడిగా గణపతిని చెబుతుందే కానీ గజముఖ స్వరూపం గురించి ఈ వేదంలో కనిపించదు. మొత్తంగా గణపతి సర్వస్వతంత్ర, సర్వవ్యాపక, సర్వశక్తి సమన్వితుడైన దేవుడని సమస్త సాహిత్యం విస్పష్టంగా ప్రకటిస్తుంది. అశ్వమేధయాగంలో ఉపయోగించే ఒక మంత్రం ఉంది.
గణానాం త్వా గణపతిగ్ం హవామహే / ప్రియానాం త్వా ప్రియపతిగ్ం హవామహే / నిధినాం త్వా నిధిపతిం హవామహే వసో మమ / అహమజానీ గర్భధమా త్వమజాసి గర్భధం..’ అంటూ సాగే ఈ మంత్రం హిరణ్యగర్భుడిగా ఉన్న ప్రజాపతిని ఉద్దేశించింది. ఇందులో ఎక్కడా గజముఖుడైన గణపతి ప్రస్తావన లేదు. మైత్రాయణీ సంహితలో ‘తత్ కరటాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్’ అనే మంత్రం ఉంది. ఈ ఒక్కచోటే గజముఖుడి గురించి వేదాల్లో కనిపిస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇన్ని విశేషాలు కలిగి ఉన్న వినాయకుడికి సాదరంగా స్వాగతం పలుకుదాం. చవితి వేడుకను శాస్ర్తోక్తంగా చేసుకుందాం.
విఘేశ్వరుడి రూపంలో మరో విశేషం ఆయన వాహనం. ఇంత భారీకాయుడు ఎలుకపై స్వారీ చేయడం కూడా ఆధ్యాత్మిక రహస్యంలో భాగంగానే చెబుతారు. ఎలుకను మూషికం అంటారు. ముష-స్తయే అనే ధాతువులోంచి పుట్టిన పదమిది. ఇది దొంగ అనే అర్థాన్నిస్తుంది. మానవుడిలోని దొంగ బుద్ధికి ఎలుక ప్రతీక. వినాయకుడు అధిరోహించిన ఎలుక పేరు అనింద్యుడు. అంటే నింద పడని వాడని అర్థం. తస్కరణ బుద్ధి నుంచి బయటపడిన అనింద్యుడు భగవంతుడి వాహనమయ్యాడు. సంస్కరణ పొందిన ఏదైనా భగవంతుడికి చేరువవుతుందనడానికి ఇదో నిదర్శనం.
– డా॥ కప్పగంతు రామకృష్ణ