విశ్వాసం గొప్పదనం
‘గురువే పరమ ధర్మం. గురువే పరాగతి... ఎవరికి దేవుడిపై, గురువుపై సమానమైన భక్తి ఉంటుందో అతను పరబ్రహ్మను పొందగలడు’ అని పై శ్లోక భావం. దీనిని బలపరిచే కథ ఇది. ధ్వజదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను దారిద్య్రంతో బాధపడుతూ నైమిశారణ్యంలోని పుష్కర మహాముని దగ్గరికి వెళ్లి సాష్టాంగపడ్డాడు. ఆ బ్రాహ్మణుడికి ముని హనుమత్ మంత్రాన్ని ఉపదేశించాడు.
- ఉపనిషత్ వాక్యం
గురురేవ పరో ధర్మో గురురేవ పరా గతిః
యస్య దేవే పరాభక్తి ర్యథా దేవే తథా గురౌ,
సబ్రహ్మవి త్పరం ప్రేయా దితి వేదానుశాసనమ్ (శాట్యాయనీయోపనిషత్)
‘గురువే పరమ ధర్మం. గురువే పరాగతి… ఎవరికి దేవుడిపై, గురువుపై సమానమైన భక్తి ఉంటుందో అతను పరబ్రహ్మను పొందగలడు’ అని పై శ్లోక భావం. దీనిని బలపరిచే కథ ఇది. ధ్వజదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను దారిద్య్రంతో బాధపడుతూ నైమిశారణ్యంలోని పుష్కర మహాముని దగ్గరికి వెళ్లి సాష్టాంగపడ్డాడు. ఆ బ్రాహ్మణుడికి ముని హనుమత్ మంత్రాన్ని ఉపదేశించాడు. ధ్వజదత్తుడు రాత్రింబవళ్లు ఆ మంత్రజపం చేశాడు. గురువుపై విశ్వాసం లేక మంత్రసిద్ధి కాలేదు. కొన్నాళ్లకు వ్యాధిపీడితుడైన గాలుడనే వేటగాడు ధ్వజదత్తుడిని కలుసుకున్నాడు. తన బాధలు ఆయనతో చెప్పుకొన్నాడు. అప్పుడు ధ్వజదత్తుడు ‘దైవం లేదు. మంత్రం లేదు. పుష్కరుడి నుంచి మాత్రం మంత్రం స్వీకరించకు’ అన్నాడు. గాలుడు ఉత్సుకతతో పుష్కర మహర్షి దగ్గరికి వెళ్లి పరిచర్య చేశాడు. అతనిపై సందేహంతో మహర్షి ధ్యానించగా హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. ‘గురుభక్తి ఉంటే సరి. ఉపదేశించవచ్చు’ అని ఆజ్ఞ ఇచ్చాడు ఆంజనేయుడు.
మంత్రోపదేశానికి ముందు గాలుడిని పుణ్యతీర్థంలో స్నానం చేసి రమ్మన్నాడు పుష్కర ముని. అప్పుడు గాలుడు ‘మీ పాద జలమే పుణ్యతీర్థం’ అన్నాడు. గురువు హనుమంతుడిని ధ్యానించి తన పాదజలాన్ని అతనిపై చల్లి ద్వాదశాక్షర మంత్రోపదేశం చేశాడు. గురు సమీపంలోనే గాలుడు 108 సార్లు జపం చేయగానే సిద్ధి లభించింది. భూత భవిష్యత్తులను దర్శించగలిగాడు. గాలుడు ఇంటికి వెళుతూ ధ్వజదత్తుడిని చూశాడు. కానీ, అతను గురునింద చేస్తాడన్న భయంతో మరోదారి ఎంచుకున్నాడు. అది గమనించిన ధ్వజదత్తుడు గాలుడికి అడ్డువచ్చి, అతనిలో అపూర్వ తేజస్సు చూసి అబ్బురపడ్డాడు. వెంటనే పుష్కరుడి దగ్గరికి వెళ్లి ‘గాలుడికి ఎలా సిద్ధి కలిగింది? నాకు ఎందుకు కాలేదు?’ అని నిలదీశాడు. అప్పుడు పుష్కరుడు ‘నీకు దైవంపైనే గాని గురువుపట్ల నమ్మకం లేనందుకు’ అన్నాడు. ధ్వజదత్తుడు పశ్చాత్తాపంతో పుణ్య నదీ తీరానికి వెళ్లి గురువు, దైవంపై సమాన విశ్వాసాన్ని దృఢతరం చేసి 108 సార్లు జపం చేయగానే అతనికి సిద్ధి కలిగింది. ఆంజనేయుడు ఉష్ట్ర వాహనారూఢుడై సువర్చలా సమేతంగా దర్శనమిచ్చాడు. ధ్వజదత్తుడికి అపార సంపదలతోపాటు మోక్షాన్ని కూడా ప్రసాదించాడు.
…? డా॥ వెలుదండ సత్యనారాయణ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

