ఒక ఊళ్లో ఓ రైతు ఉండేవాడు. అతనికి వరి పొలంతోపాటు కొన్ని పూలతోటలు కూడా ఉండేవి. ఓ రోజు రైతు భార్య కనకాంబరం పూలు మూటగట్టి భర్త చేతికి ఇచ్చింది. పక్క ఊరిలో ప్రతి శనివారం జరిగే సంతలో వాటిని అమ్మాలని చెప్పింది. ఆ వచ్చిన డబ్బుతో బంగారం కన్నా సింగారమైనది కొనమని కోరింది. మిగిలిన డబ్బులను ఇంటికి తీసుకుని రమ్మంది. రైతు వెళ్లి సంతలో కనకాంబరాలను మంచి ధరకే అమ్మాడు. వచ్చిన డబ్బుతో బంగారం కన్నా సింగారమైనది కొనాలని సంత మొత్తం తిరిగాడు.
అంగట్లో ఉన్నవాళ్లందరినీ విచారించాడు. ‘బంగారమే సింగారం. దానికన్నా గొప్ప సింగారం ఎక్కడ ఉంటుంది?’ అని అక్కడి అందరూ అతణ్ని ఎద్దేవా చేశారు. రైతుకు ఏం చేయాలో తోచలేదు. లేకలేక భార్య కోరిన కోరిక తీర్చలేకపోతున్నందుకు బాధేసింది. నేరుగా రాములవారి గుడికి వెళ్లాడు. వాడిన ముఖంతో గుడిమెట్ల మీద కూర్చున్నాడు.
అక్కడ ఓ పండితుడు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. దిగులుగా ఉన్న రైతును చూసిన పండితుడు ‘ఎందుకలా ఉన్నావు?’ అని ప్రశ్నించాడు. రైతు ఆ పండితుడితో బాధగా ‘నా భార్య తిక్కలది. అందుకే బంగారం కన్నా సింగారమైనది సంతలో కొనుక్కురమ్మని నన్ను కోరింది’ అని చెప్పాడు.
దానికి పండితుడు నవ్వి ‘నీ భార్యకు కాదు తిక్క. నీకు! ఎందుకంటే ఆమె చెప్పిన దాంట్లో గూఢార్థం ఉంది. అది ఏమిటంటే, బంగారం కన్నా సింగారమైనది నుదుటి బొట్టు. సంతలో బొట్టు కొనుక్కురమ్మని నిన్ను కోరింది. అది తీసుకెళ్లి ఆమెకు ఇస్తే సరిపోతుంది’ అని సలహా ఇచ్చాడు. ‘అవును నిజమే..’ అనుకున్న రైతు నేరుగా వెళ్లి అంగట్లో బొట్టు సీసా కొనుక్కుని ఇంటి దారి పట్టాడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు,93936 62821