దిమ్మ తిరిగిన బమ్మదేవర
శుకముని- రాజా! ఇదంతా తన తనయుని- పితామహుని పితలాటకమే (మోసమే)- మాయే అని తెలుసుకొని సతాంగతి (సత్పురుషులకు దిక్కు) అయిన మాయాపతి మాధవుడు, ఇక నా మాయ ఏమిటో అతనికి చూపుతానని సంకల్ప మాత్రాన లేగల, బాలుర రూపాలు అన్నీ తానే ధరించాడు చిన్నికృష్ణుడు. ఇది భగవంతుని ఇచ్ఛాసృష్టి.
శుకముని- రాజా! ఇదంతా తన తనయుని- పితామహుని పితలాటకమే (మోసమే)- మాయే అని తెలుసుకొని సతాంగతి (సత్పురుషులకు దిక్కు) అయిన మాయాపతి మాధవుడు, ఇక నా మాయ ఏమిటో అతనికి చూపుతానని సంకల్ప మాత్రాన లేగల, బాలుర రూపాలు అన్నీ తానే ధరించాడు చిన్నికృష్ణుడు. ఇది భగవంతుని ఇచ్ఛాసృష్టి. భోగానుభవానికి ఏర్పడింది జీవసృష్టి. ఇది మనస్సు కల్పించింది. సుఖదుఃఖాలు, లాభనష్టాలు మొదలైన ద్వంద్వాలతో కూడింది. ఈశ- దేవదేవుని సృష్టి పాంచభౌతికం కాదు. లీలా సృష్టి. ఇది ద్వంద్వ రహితం, కేవలం ఆనందమయం. పరమాత్మ ఇచ్ఛామాత్రాన పంచభూతాలు ప్రభవిస్తాయి. వాని ఆధారంతో విరించి- బ్రహ్మ ప్రపంచం రచిస్తాడు. కురు సభలో పరువు దక్కే తెరువు (దారి) కానక తల్లడిల్లుతున్న సతీమతల్లి ద్రౌపది మాన పరిరక్షణకి కరుణా సముద్రుడు, కరి వరదుడు, ఫుల్లారవిందాక్షుడు కృష్ణుడు ఇచ్చిన అక్షయ వస్ర్తాలు ఏ మగ్గం మీద నేసినవి? ఏ మిల్లులో తయారైనవి? అది నల్లనివాని వస్ర్తావతారం. సంకల్ప సృష్టి! లీలా సృష్టి!
కం॥ ‘రూపంబు లెల్ల నగు బహు
రూపకుడిటు బాలవత్సరూపంబులతో
నేపారుటేమి చోద్యము?
రూపింపగ నతనికితర రూపము గలదే?’
‘వింత గొలిపే ఈ జగన్నాటకంలోని అనంత రూపాలు ధరించే అంతర్యామి స్వరూపుడు కృష్ణుడు. ఆ నటన సూత్రధారి ఇలా బాలుర, లేగల పాత్రలు ధరించడం ఏమి విచిత్రం? ఏ రూపంలో ఉన్నా ఆ నంద గోపసుతుడే కదా! అనంత రూపునికి ఈ అంతర్యామి రూపం తప్ప మరో రూపం లేదు గదా!’ అమూలకమైన ఈ కందంలో అమాత్యుడు పోతన సర్వ రూపుడైన ముకుందుని అరూపమైన ‘అంతర్యామి’ రూపాన్ని- సాక్షి చైతన్యాన్ని నిరూపించిన చందం చాలా అందము, అపురూపము.
రాజా! బహు వన్నెచిన్నెల, తీరు తెన్నుల, రంగు రుచుల సంగడీడు (మిత్రు)ల, లేగల దేహాలన్నీ, ఆహా! తానే అయిపోయాడు నంద తనయుడు. కనుముక్కు తీరేగాక కడకు వారి చిక్కాలు, చొక్కాలు, గిన్నెలు, చేతి కర్రలు, వస్ర్తాలు, వేణువులు, ఒంటి మీది సొమ్ము, కొమ్ము బూరలు, బాస యాస మొదలైన జడ వస్తువులు కూడా ఏదీ వదలకుండా అన్నీ తానే ధరించాడు యదు బాలుడు! ‘ఇక దూడలను వాడలకు మళ్లించండి’ అని మాటాడుతున్న కృష్ణుడు, మరలించే గోప కుమారులు, మరలింపబడే లేగలు అన్నీ తానే అయి నందగోపాలుడు వేణువు ఊదుతూ బృందావనానికి బయల్దేరాడు. ‘సర్వం విష్ణుమయం జగత్’ అను వేదవాక్యం రూపుదాల్చినట్లు బాలకృష్ణుడు సర్వ స్వరూపుడై ఉర్వి- భూమిపై అఖర్వం- సర్వాధికంగా ప్రకాశించాడు. శ్రుత్యంత- వేదాంత సిద్ధాంతమైన ‘సర్వాత్మ’ భావానికి ఈ లీల అత్యంత జ్వలంతమైన దృష్టాంతం!
తల్లులు.. పిల్లల వేణునాదాలు విని పరవశించి వారిని అక్కున చేర్చుకున్నారు. పాలిండ్లలో ఉవ్వెత్తున చేపుకు వచ్చిన పీయూషం- అమృతం వంటి ఆ పాలని చాలా ప్రేమతో బాలలకు తాగించారు. ఆవులు కడా ఎదిగిన దూడలను నాకుతూ పొదుగుల నుండి జాలువారుతున్న పాలను ప్రీతితో తాగించాయి. ఈ ప్రేమలు వారికి నిత్యనూతనంగా కొత్త చిగుళ్లు తొడుగుతూ ఉండేవి. భగవంతుడు ఇలా దూడల, బాలల రూపాలలో గోవులకు, గోపికలకు, ఒక సంవత్సర కాలం బ్రహ్మానంద సాగరంలో ఓలలాడించాడు.. ‘గో గోప గోపీ జన మధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణ చంద్రమ్’. గోవుల, గోపకుల, గోపికల యందు పుత్రభావం చూపి పరవశింపజేస్తున్నా పరమాత్మకు గోపకుమారుల వలె ‘నేను వీరికి పుత్రుణ్ని’ అను మోహం ఇంచుకైనా లేదు. తల్లిపాలు విడిచిన వయస్సులో ఉన్న పిల్లలపైన, దూడలపైన తల్లులకు, ఆవులకు కలుగుతున్న ఇంత అధికమైన వాత్సల్యం బలరామునికి ఎంతో వింతగా తోచింది. మరో ఐదారు రోజులకు ఏడాది నిండుతుందనగా అతడు దివ్యదృష్టితో ‘వాసుదేవః సర్వం’- అంతా తమ్ముడే అని గ్రహించాడు.
ఈ సంవత్సర కాలంలో దేవయానంలో బ్రహ్మదేవునికి ఒక తృటి (సరికొత్త సూదితో తామరాకును తూటు పొడవడానికి పట్టే కాలం), ఆయన వచ్చి లేగలను, బాలురను చూచి ఆగమైపోయాడు. తమ్మిచూలి బమ్మకు దిమ్మ తిరిగింది. నలువ (బ్రహ్మ) నిలువలేకపోయాడు. తాను దాచిన వారు మాయా గుహలో నిద్రలో ఉన్నారు. ‘నాకు మారు మరో నీటి పుట్టుగు పట్టి (కమల సంభవుడు) లేనప్పుడు వీరెవరు? ఇక ఈ నలువకు విలువేముంది? మరొకరు పుట్టించి ఉంటే అన్ని విధాల నేను గుట్టుగా దాచినవారి వలె సృష్టించగలరా? అణుమాత్రమైనా తేడా ఉండదా? ఈ పెక్కురిలో ఒక్కడుగా- అంతర్యామిగా వెలుగుతున్న ‘పరబ్రహ్మ’ కాదు కదా వీరి సృష్టికర్త? ఈ వింతను గురించి చింతన చేసే కొద్దీ నాకు బుద్ధి జాడ్యం కలుగుతోంది’ అనుకొని అక్కజ (ఆశ్చర్య)పడి నలుదిక్కులా చూసి బిక్కమొహం వేశాడు పొక్కిలి చూలి (నాభి జన్ముడు).
కం॥ ‘మోహము లేక జగంబుల
మోహింపగ జేయ నేర్చి మొనసిన విష్ణున్
మోహింపించెద ననియెడు
మోహమున విధాత తాన మోహితుడయ్యెన్’
విశ్వమంతటినీ మోహంలో ముంచివేయగల మోహ రహితుడైన మాధవునే మోహ పెడదామనే మోహంలో పడి మొదటివేల్పు తానే విమోహితుడై పోయాడు. రాజా! మాయకు పుట్టినిల్లు అయిన భద్రపురుషుడు మాయాపతి విష్ణువుపై క్షుద్రమైన ఇతర మాయలు పనిచేస్తాయా? మోహమనగా అవివేకం. వస్తుతత్త్వం- సత్యం తెలుసుకోలేని భ్రాంతి దశ, అజ్ఞానం. పరిపరి విధాల ఆలోచిస్తూ, పరితపిస్తూ బ్రహ్మ ఒకపరి బాలురవంక తేరిపార చూశాడు. అందరూ శ్రీహరి స్వరూపాలుగా దర్శనమిచ్చి బ్రహ్మను బెదరగొట్టారు. వేదాంతం సాంతం తెలిసిన వారికైనా ఈ రూపాలు ఆసాంతం- ఆద్యంతం తెలియవు. ఈ అద్భుతాన్ని చూడగానే బ్రహ్మ దేవుని ఏకదాశ ఇంద్రియాలూ స్తంభించి పోయాయి. బొమ్మ గీసినట్లు కిమ్మనకుండా- గమ్మున ఉండిపోయాడు! తనయునిపై జాలిపడి అప్పుడు బాలకృష్ణుడు తాను కప్పిన మాయాజాలాన్ని విప్పివేశాడు. తన లీలా రూపాలన్నిటిని తనలోనే లీనం చేసుకొన్నాడు. ఇంతలో బ్రహ్మదేవుడు, చచ్చినవాడు బతికి వచ్చినట్లు తేరుకొని తెప్పరిల్లాడు. మునపటి లాగానే చేతిలో పెరుగన్నపు ముద్దతో, సర్వజ్ఞుడైనా అజ్ఞాని వలె బాలురను, దూడలను వెదుకుతున్న వానిని, పరమాత్మని వేల్పుపెద్ద వాణి మగడు చూచాడు. ఆనంద బాష్పాలు జాలువారుతుండగా నందనందనుని పాదారవిందాలపై పడి కాళ్లు కడిగాడు. భక్తి పరవశుడై గద్గద స్వరంతో, నాలుగు ముఖాలతో గోపాల బాలుని స్తుతించాడు. వేద గర్భుడు- బ్రహ్మ చేసిన ఇంపుసొంపారు (మిక్కిలి శోభించు) ఈ స్తోత్రంలో బాదరాయణుడు- వ్యాసుడు నాలుగు వేదాల సారాన్ని నింపాడు..
కం॥ ‘శ్రేయములు గురియు భక్తిని
జేయక కేవలము బోధసిద్ధికి దపముం
జేయుట విఫలము పొల్లున
నాయము సేకురునే తలపనధికంబైనన్’
ఆదిదేవా! సర్వశుభాలను వర్షించే భక్తిని కాదని కేవలం బోధ- జ్ఞానం కొరకు తపించడం ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు. పైపెచ్చు అది ఎంతో ఖేద జనకం కూడా! ఎంత ఎక్కువగా కూడబెట్టినా ఊక వలన ఏమి ఆదాయం చేకూరుతుంది? సుగుణ ధామా! నీ నిర్గుణ వైభవాన్ని కనగలగటం కష్టమనుకుంటారు కాని, నిజానికి నీ సగుణ ప్రాభవం తెలుసుకొనగలగటమే కష్టతరం’.
కం॥ తారా తుషార శీకర
భూ రజములకైన లెక్క బుధులిడుదురు భూ
భారావతీర్ణ కరుడగు
నీ రమ్య గుణాలి నెన్న నేరరగణ్యా!’
‘యదువీరా! నింగిలో మెరిసే నక్షత్రాలను, రంగు- అందంగా కురిసే మంచు తుంపరలను, నేల మీది ధూళి కణాలను బుధులు- సమర్థులు లెక్కించగలరేమో కాని, అవనీ (భూ) భారాన్ని తొలగించడానికి అవతరించిన నీ సుమనోహరములైన- రమణీయ గుణాలను ఎంత పండితుడైనా సాంతం లెక్కపెట్ట లేడు కదా!’, ‘మహానుభావా! మాయావులను కూడా మాయలో పడవేసే మహామాయావివి నీవు. దావాగ్ని నుండి పుట్టిన జ్వాల దానిని మించి వెలగ గలదా? నీ సేవాదాసునిగా మన్నించి వాసుదేవా! నన్ను కావవా? మాయా నాశకా! ఎప్పటిదో ఎందుకు? ఈ కాయం- అవతారంలోనే, బహిస్థ (బయట ఉన్న) జగత్తును గమ్మత్తుగా అంతస్థం- నీ నోటిలో ఉన్నదిగా చూపి తల్లిని అబ్బురపరచిన మేటివి నీవు. ఈ ప్రపంచమంతా ఖాయంగా నీ మాయా మాత్రమే అనడానికి ఏమి ప్రమాణం కావాలి? నీవు వత్స (దూడల) బాలల రూపాల్లో ఏ గోవుల, గోపికల చనుబాలు తనివి తీరా తాగావో, వారి తనువులు మనువులు (జీవితాలు) ఎంత ధన్యములో కదా! అంతటి నీ తృప్తికి ఎన్ని యజ్ఞాలు, యాగాలైనా ఎంతమాత్రం సరిరావు గదా’ అని సవినయంగా మనవి చేసుకుంటున్నా.
శా॥ ‘ఏలా బ్రహ్మపదంబు? వేదములకున్ వీక్షింపగరాని ని
న్నీలోకంబున నీవనాంతరమునం దీమందలోఁ గృష్ణయం
చాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు నీ
వ్రేలం దొక్కని పాద రేణువులు పై వేష్టించినం జాలదే?’
‘అభేద స్వరూపా! నిష్ఖేదా! వేదాలు నిన్ను వర్ణింపగలవే కాని వీక్షించ లేవు గదా! ఆ నిగమాలకు నీ పాద ధూళి ఇప్పటికీ అగమ్య గోచరమే! అట్టి నిన్ను ఈ భూలోకంలో, ఈ అడవిలో, ఈ బృందావనంలో సఖునిగా, సహచరునిగా పొందగలిగిన గోపకులు ‘నందనందనా! కృష్ణా’ అంటూ ఆటపాటలు, మాటల నుంచి అన్ని మనోభావాలూ నీకే సమర్పించుకొంటున్నారు. ఈ వల్లవ (గొల్ల) బాలురలో ఒక్కని పల్లవ (చిగురాకుల వంటి) పద రేణువు నా తలపై ధరించగలిగితే చాలదా? ఓ లీలా బాలకా! నాకీ బ్రహ్మపదవి ఏలనయ్యా?’ మూలంలోని ‘ఏలా బ్రహ్మపదంబు’ అన్న నిర్వేదం- భక్తి, తత్తజ్ఞాన, దుఃఖాదుల వలన కలగే పరవైరాగ్యం పరమ భాగ్యశాలి అయిన పోతన గారి శీలం! బ్రహ్మలోక తృణీకారం వేదాంతంలో వైరాగ్యానికి పరాకాష్ఠగా చెప్పబడ్డది.
కం॥ ‘దేహము కారాగేహము
మోహము నిగళంబు; రాగముఖరములు రిపు
వ్యూహములు భక్తితో ని
న్నూహింపని యంతదడవు నో కమలాక్షా!’
‘ఓ పద్మాక్షా! అమలిన భక్తితో నీ పదకమలాలను స్మరించనంత కాలం ఎవరికైనా, వారి దేహమే వారికి కారాగృహం, మోహమనేదే వారికి సంకెల- సంకెళ్లు, రాగద్వేషాదులే రిపు- శత్రు వ్యూహాలుగా పరిణమిస్తాయి’ అమాత్యుని పై కందం మూల శ్లోకానికి మిక్కిలి విధేయమైన అనువాదం. ‘సర్వేశ్వరా! అన్ని విధాలైన అపచారాలూ చేసిన నన్ను మన్నించి అనుగ్రహించు. ఈ అల్పుడు ఈ కల్ప పర్యంతం- ఆయుర్దాయం ఉన్నంత కాలం, నీకు నమస్కరిస్తూనే ఉంటాడు. ఇక సెలవు’ అంటూ బ్రహ్మదేవుడు మూడుసార్లు కృష్ణునకు ప్రదక్షిణం గావించి, పాదాలకు మొక్కి క్షమించబడి సత్యలోకానికి వెళ్లిపోయాడు.
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

