ఆదివారం 31 మే 2020
Devotional - Apr 08, 2020 , 21:51:43

శ్రీరామ సాక్షాత్కారం

శ్రీరామ సాక్షాత్కారం

ప్రతిభామూర్తి, పవిత్ర కీర్తిని పొందిన పోతనామాత్యుడు సంసారసాగర సేతువైన భాగవతాన్ని అనువదించడానికై ఉపక్రమిస్తూ, ‘అనేక వేల జన్మలలో సంపాదించుకొన్న తపఃఫలం వల్లనే తన హృదయంలో పురుషోత్తముని పుణ్యకథా గ్రంథాన్ని అనువదించాలనే ఆసక్తి కలిగిందని’ వెల్లడించాడు. ఇది ఒక దైవ ప్రేరణగా, ఒక దివ్య కార్యంగానూ తలపోశాడు ఆ మహానుభావుడు. అంతేకాదు, ‘తన పూర్వపుణ్య విశేషం వల్లనే పూర్వకవులు భాగవతాన్ని అనువదించకుండా ఆ అమృతభాండాన్ని తన కోసం నిల్వ చేశారని, ఇది తనకు లభించిన సువర్ణావకాశం’ అని వర్ణించి మురిసిపోయాడు పోతన.

‘ఏ కార్యం సత్ప్రేరణతో మొదలవుతుందో అది సుశ్లోకమవడమేకాక సకల లోక హితాన్ని కూడా సంపాదించి పెడుతుంది’ అనడంలో ఏ సందేహమూ లేదు. పుణ్యశ్లోకుడైన పోతన సు‘వర్ణ’మయంగా పోతబోసిన భాగవతం కవితాపరంగా ఒక ఉత్తుంగ రసతరంగిణి అయితే భక్తిపరంగా ఆయనొక ఆధ్యాత్మిక మేరుశిఖరం కావడానికి మొదటి కారణం భగవత్ప్రేరణ కాగా, రెండవ కారణం ఆ మహాకవికి శ్రీరామ సాక్షాత్కారం కావడం.

అదొక పున్నమి రోజు. ఆ రోజును ‘పోతన పున్నెం (పుణ్యం) పండిన రోజు’గా ఊహించవచ్చు. విశేషించి, అది చంద్రగ్రహణపు పవిత్ర వేళ. ఆ వేళ దివ్య గోదావరీ నదీ స్నానం 

చేసిన ఆ మహామనీషి పావన గౌతమీతీరంలో మహేశ్వరుడైన శివుణ్ణి లక్ష్యంగా చేసుకొని అరవిప్పారిన కన్నులతో ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు, ఆ పుణ్యమూర్తికి శ్రీరామచంద్రస్వామి దర్శనమైందట. అది చంద్రగ్రహణం కావడంతో చంద్రుడు కనిపించే అవకాశం లేదు. అయితే, రామచంద్రుడు కనిపించాడు. ఎంత హృదయంగమ సన్నివేశం. ఇంకేం, 

భాగవతానువాదానికై పోతన్నకు శ్రీరాముని ఆజ్ఞ లభించింది. ఇక్కడే ఒక వింత చోటు చేసుకొన్నది. అదేమిటంటే, ‘పోతన చేసింది హర (శివుని) ధ్యానం. అతనికి కలిగింది హరి (రామ) దర్శనం. హరిహరులకు భేదం లేదనే సిద్ధాంతానికి ఇంతకంటే బలీయమైన ప్రమాణమేముంటుంది! హరిహరులలో కనిపించేది ‘గుడి’(ర/రి) భేదమే కదా. వారిరువురిలో ఆత్మభేదం ఎంతమాత్రం లేదనేది నిర్వివాదం.

పోతన తాను దర్శించిన శ్రీరామచంద్రస్వామిని ఒక అందమైన ‘సీస’పద్యంలో ఆత్మానందంతో వర్ణించి,   ఆ హృద్యమైన అనుభూతిని మనకు మనసారా అందించాడు. ఆ సుమధుర వర్ణనలోకి తొంగిచూస్తే.. ‘మెరుపుతో కూడిన వినీల మేఘం లాగా మేటి లావణ్యవతియైన సీతతో కూడియున్నవాడు, చంద్రమండలం కురిపించే సాంద్రమైన వెన్నెల వానలాగా అందమైన ముఖంపై సుందరమైన చిరునవ్వు కలవాడు, సోయగాల తీగెతో పెనవేసికొన్న నల్లని తమాల వృక్షం (కానుగు చెట్టు) లాగా దండి కోదండాన్ని భుజాన వేసుకొన్నవాడు, నల్లని పర్వతశిఖరంపై మొలిచిన ఉదయ సూర్యబింబం లాగా మిరుమిట్లు గొలిపే గొప్ప సువర్ణ కిరీటాన్ని తలపై ధరించిన వాడు, తెల్ల తామరల లాంటి విప్పారిన కండ్లు కలవాడు, విశాలమైన చాతి గలవాడు, భద్రముద్రాంకితమైన ఆకారం కలవాడు.. అయిన రాజముఖ్యుడైన రాముడు నా కంటి ఎదుట సాక్షాత్కరించినాడు’.. అని ఆ మహాకవి            శ్రీ రాముని ముగ్ధమనోహర రూపాన్ని మృదుమధురంగా కవిత్వీకరించాడు.

ఈ వర్ణనను లోతుగా పరిశీలిస్తే.. సీతను మెరుపుతో పోల్చడం ‘విద్యుల్లేఖేవ భాస్వరా’ అన్న శ్రుతివాక్యాన్ని గుర్తుకుతెస్తున్నది. రాముని చిరునవ్వును వెన్నెలతో పోల్చడం, ఆశ్రితలోక చకోరాలకు ఆ స్వామి చిరునవ్వు సంజీవని అనే అంశాన్ని సూచిస్తున్నది. ఇక, ఆయన భుజాన ఉన్న కోదండం ‘శిష్టరక్షణకు దుష్టశిక్షణ’కు ప్రతీయమా నం. అలాగే, కిరీటాన్ని సూర్యునితో పోల్చిచెప్పడ మంటే అది సకల జగతికి ప్రగతిని కల్పించే చైతన్య దీప్తిని ప్రసాదించగలదని స్ఫురింపజేయడానికే. అలాగే, పద్మాల వంటి విప్పారిన నేత్రాలు, విశాలమైన చాతి, భద్రమైన మూర్తిమత్తం.. ఇవన్నీ శ్రీరాముని మంగళకరత్వానికి అద్దం పట్టేవి. ఇలా.. పోతనామాత్యులు తాను కండ్లారా చూసిన శ్రీరామరూపాన్ని మనమూ మనసారా ఉపాసిద్దాం. మధురానుభూతిలో తేలిపోదాం.


logo