కోయంబత్తూర్ : తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా పొల్లాచ్చిలో దారుణం జరిగింది. 19 ఏండ్ల యువతి 17 ఏండ్ల బాలుడితో పారిపోయి పెండ్లి చేసుకుని అతడిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. మైనర్ బాలుడి తల్లి ఫిర్యాదుతో యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలు పొల్లాచ్చిలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తుండగా బాలుడు ఇటీవల ఇంటర్ పాసయ్యాడు.
బాలుడు గత ఏడాదిగా పెట్రోల్ బంకుకు వస్తుండటంతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో గురువారం టీనేజ్ బాలుడితో కలిసి యువతి పళనికి పారిపోయింది. వారిద్దరూ సెమ్మెడు ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని రోజంతా గడిపారు. ఈ సమయంలో బాలుడిని పెండ్లి చేసుకున్న యువతి అతడిని లైంగిక వేధింపులకు గురిచేసింది. మరుసటి రోజు వారు కోయంబత్తూర్ తిరిగివచ్చారు. మైనర్ బాలుడి తల్లి యువతిపై ఫిర్యాదు చేయగా, విషయం తెలుసుకున్న యువతి పొల్లాచ్చిలోని మహిళా పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.