లక్నో: పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైఫ్పూర్ గ్రామానికి చెందిన 22 ఏండ్ల కాంచన్ శర్మ బీఏ చదువుతున్నది. ఆమె హస్తినాపూర్‌లో కంప్యూటర్ కోర్స్‌లో కోచింగ్ తీసుకుంటున్నది. మూడు నెలల కిందట ఆమెకు షాపు యజమాని రోహిత్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. రోహిత్ షాపింగ్ కోసం కాంచన్ రూ.25 వేలు కూడా ఖర్చు చేసింది.
కాగా, తనను పెండ్లి చేసుకోవాలని కాంచన్ అడగడంతో రోహిత్ ఆమె నుంచి తప్పించుకోసాగాడు. దీంతో కాంచన్ బుధవారం రోహిత్‌కు ఫోన్ చేసింది. తాను అతడి వద్దకు వస్తున్నానని, తనను తప్పక పెండ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. అనంతరం తన వద్దకు వచ్చిన కాంచన్‌ను రోహిత్ కారులో సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ గొంతునులిమి ఆమెను హత్య చేశాడు. రోహిత్ స్నేహితులు సౌరభ్, రాహుల్ దీనికి సహకరించారు. అనంతరం కాంచన్ మృతదేహాన్ని హస్తినాపురంలోని భీమ్‌కుండ్ గంగా నదిలో పడేశారు.
మరోవైపు కుమార్తె కనిపించకపోవడంతో కాంచన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితులైన రోహిత్, అతడి స్నేహితులు సౌరభ్, రాహుల్‌ను అరెస్ట్ చేశారు. కాంచన్‌ను తామే చంపినట్లు ఆ ముగ్గురు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాం కోసం నదిలో గాలిస్తున్నట్లు చెప్పారు.