బెంగళూరు: మగవాడిగా నటించి మహిళను మోసం చేసిన ట్రాన్స్‌జెండర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. ఉడిపి జిల్లాలోని శంకరనారాయణ ప్రాంతానికి చెందిన ట్రాన్స్‌జెండర్, మగవాడిగా ఫేస్బుక్ ప్రొఫైల్ సృష్టించాడు. సివిల్ ఇంజినీర్‌గా అందులో పేర్కొన్నాడు. దక్షిణ కన్నడ జిల్లా విట్లా నగరానికి చెందిన ఒక మహిళతో ఆ ట్రాన్స్‌జెండర్‌కు పరిచయం ఏర్పడింది. గత నాలుగేళ్లుగా వారిద్దరూ ఫేస్బుక్లో చాట్ చేసుకోవడంతోపాటు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. దీంతో వారిద్దరూ ప్రేమలో పడ్డారు.
కాగా, ఆ మహిళ ప్రవర్తనపై ఆమె తల్లికి అనుమానం వచ్చింది. కుటుంబ స్నేహితురాలు, న్యాయవాది అయిన శైలజాకు ఈ వ్యవహారం గురించి చెప్పింది. దీంతో పోలీసుల సహాయంతో ఆ మహిళ ఫేస్బుక్ ఫ్రెండ్ గురించి ఆమె వాకబు చేసింది. చివరకు ఫోన్ కాల్స్ ఆధారంగా ఉడిపి జిల్లాలోని శంకరనారాయణ ప్రాంతానికి చెందిన ట్రాన్స్‌జెండర్ అని తెలిసింది. దీంతో మగవాడిగా నమ్మించి మహిళను మోసం చేసిన ఆ ట్రాన్స్‌జెండర్‌ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.