Shooting in America | అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేగింది. శనివారం న్యూ మెక్సికోలోని రెడ్ రివర్ ఏరియాలో జరిగిన మోటార్ సైకిల్ ర్యాలీపై దుండగులు జరిపిన కాల్పుల్లో కనీసం ముగ్గురు మరణించారు. మరో ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయని రెడ్ రివర్ మేయర్ లిండా కాల్హౌన్ తెలిపారు.
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం డెన్వర్‌కు ‘ఎయిర్ అంబులెన్స్’లో తరలించినట్లు న్యూ మెక్సికో స్టేట్ పోలీసులు తెలిపారు. అంతకుముందు ఇద్దరు వ్యక్తులు మరణించారని, ఆరుగురు గాయపడ్డారని న్యూ మెక్సికో స్టేట్ పోలీసులు ట్వీట్ చేసినట్లు సీఎన్ఎన్ తెలిపింది.
మోటారు సైకిల్ ర్యాలీపై కాల్పులకు దిగిన వ్యక్తులు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారని మేయర్ లిండా కాల్హౌన్ తెలిపారు. వారంతా ‘బైకర్ గ్యాంగుల ముఠా సభ్యులు’ అని కూడా తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలం సురక్షితంగా ఉందని న్యూ మెక్సికో స్టేట్ పోలీసులు చెప్పారు. ప్రజా భద్రతకు ఎటువంటి ముప్పు లేదన్నారు.
వారాంతపు మెమోరియల్ డే సందర్భంగా జరిగిన వార్షిక మోటారు సైకిల్ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు. మోటారు సైకిల్ ర్యాలీని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అంటున్నారు. ఈ ప్రాంతాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.