ఖమ్మం : ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామ సమీపంలో టీఆర్ఎస్ నాయకులు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని పొన్నెకల్ రైతు వేదిక వద్ద జాతీయ జెండాను కృష్ణయ్య ఎగురవేశారు.
అనంతరం ఆయన తన కారు డ్రైవర్ కే ముత్తేశంతో బైక్పై తెల్దారుపల్లికు తిరిగి వస్తుండగా.. ఆ గ్రామ సమీపంలో బైక్ను ఆటోతో ఢీకొట్టారు. కింద పడ్డ కృష్ణయ్యపై దుండగులు వేట కొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు కృష్ణయ్య. అయితే కృష్ణయ్య రెండు చేతులను నరికి తమ వెంట తీసుకెళ్లారు దుండగులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే దుండగుల్లో కొందరు కృష్ణయ్యకు తెలిసిన వారే ఉన్నారని ఆయన కారు డ్రైవర్ ముత్తేశం పేర్కొన్నాడు. కొందరిని గుర్తు పట్టానని పోలీసులకు తెలిపాడు.