Noida Accident | కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారులోని కాంజావాల్ ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు సుమారు 12 కిలోమీరట్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ అమానవీయ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత ఇదే తరహాలో గ్రేటర్ నోయిడాలో మరో ఘటన చోటు చేసుకుంది. స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌ను ఢీ కొట్టిన కారు.. అతన్ని దాదాపు అర కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. జనవరి 1వ తేదీ తెల్లవారుజామున గ్రేటర్ నోయిడా సెక్టార్ 14లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నోయిడాకు చెందిన కౌశల్ స్విగ్గీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. కొత్త ఏడాది సందర్భంగా రాత్రిపూట ఫుడ్ డెలివరీ కోసం వెళుతుండగా సెక్టార్ 14 లోని ఓ ఫ్లై ఓవర్ దగ్గర వేగంగా వచ్చిన కారు అతను ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. బైక్‌తో పాటు కౌశల్ కారు కింద పడిపోయాడు. కారు అలాగే ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది. కారు కింద చిక్కుకున్న కౌశల్‌ను సుమారు అర కిలోమీటర్ మేర ఈడ్చువెళ్లింది.
అనంతరం డ్రైవర్ కారును పక్కకు ఆపి చూడగా చక్రాల కింద కౌశల్ కనిపించాడు. ఘటనతో భయాందోళనకు గురైన డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.