గౌహతి: ఒక ఆర్మీ జవాన్ తన భార్య, కుమార్తెను హత్య చేశాడు. అనంతరం ఆలయంలో దాక్కున్న అతడ్ని ఆర్మీ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అస్సాంలోని శ్రీకోనలో అస్సాం రైఫిల్స్ సైనిక శిబిరంలో ఈ సంఘటన జరిగింది. జమ్ముకశ్మీర్ అఖ్నూర్‌లోని జౌరియన్ ప్రాంతానికి చెందిన రవీందర్ కుమార్, 39 అస్సాం రైఫిల్స్‌లో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది మార్చి 10న సాంబాలో ఉంటున్న భార్య, కుమార్తెను అస్సాంలోని ఆర్మీ క్వాటర్స్‌కు తీసుకువచ్చాడు.
అయితే కుటుంబ కలహాల వల్ల శనివారం తెల్లవారుజామున 4.15 గంటలకు హవల్దార్ రవీందర్ దారుణానికి పాల్పడ్డాడు. పదునైన చాకుతో 32 ఏళ్ల భార్య మోనికా డోగ్రా, పదేళ్ల కుమార్తె రిద్ధి గొంతు కోశాడు. దీంతో ఆర్మీ క్వాటర్స్‌లోని ఇంటిలో వారిద్దరూ రక్తం మడుగుల్లో పడి మరణించారు.
ఈ సంఘటన అనంతరం హవల్దార్ రవీందర్ కుమార్, ఆర్మీ క్యాంప్‌లోని ఆలయంలో దాక్కున్నాడు. ఈ విషయం తెలిసిన ఆర్మీ సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకున్నారని ఆర్మీ అధికారి తెలిపారు. అనంతరం పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. కుటుంబ కలహాల వల్లనే అతడు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పేర్కొన్నారు.