ముంబై : క్యాస్టింగ్ కౌచ్ ఘటనలో ముంబై పోలీసులు ఓ నకిలీ డైరెక్టర్‌ను అరెస్ట్ చేశారు. తన కోరిక తీరిస్తే సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని ఓ నటిని మభ్యపెట్టిన నకిలీ దర్శకుడిని తిత్వాలా ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలి వ్యక్తిగత ఫోటోలను డిమాండ్ చేసిన నిందితుడు ఆపై తనకు దగ్గరయ్యేందుకు ఆమె నిరాకరించడంతో వాటిని వైరల్ చేస్తానని బెదిరించాడని మలద్ ఎస్ఐ ధనంజయ్ లిగాడె తెలిపారు. బాధితురాలు కోల్‌కతాకు చెందిన నటి కాగా ఆమె కొన్ని బెంగాలీ సినిమాల్లో నటించింది. ఓ వెబ్‌సిరీస్‌లో ఆమెకు అవకాశం ఇస్తానని క్యాస్టింగ్ డైరెక్టర్ ఆమెను ప్రలోభపెట్టాడు.
నిందితుడిని గతంలో ఓ ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేసిన ఓంప్రకాష్ తివారీగా గుర్తించారు. నటుల క్యాస్టింగ్ ప్రక్రియపై అవగాహన ఉన్న ప్రకాష్ సోషల్ మీడియాలో తాను ప్రొడక్షన్ హౌస్ నిర్వహిస్తున్నట్టు తప్పుగా ప్రచారం చేసుకున్నాడు. లైంగిక కోరికలు తీర్చకుంటే సోషల్ మీడియాలో తన ప్రైవేట్ ఫోటోలను వైరల్ చేస్తానని బెదిరించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.