చెన్నై : మరదలిపై కన్నేసి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న బావ కోరిక తీర్చలేదని ఆమెతో పాటు ఏడాదిన్నర చిన్నారిని తీవ్రంగా హింసించి సజీవ దహనానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లా నాధం గ్రామంలో శనివారం జరిగింది. బాధితులను అంజలి (22), ఏడాదిన్నర వయసున్న ఆమె బిడ్డ మలర్విజిగా గుర్తించారు. అంజలికి కొన్నేండ్ల కిందట దినసరి కూలీగా పనిచేసే శివకుమార్‌తో వివాహమైంది.
వీరంతా ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నారు. శివకుమార్ సోదరుడు కరుపయ్య (30) అంజలిపై అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ ఆమెను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. శనివారం శివకుమార్ పనిమీద బయటకు వెళ్లగా అంజలి గొర్రెలు మేపేందుకు వెళ్లింది. ఆమెను వెంబడించిన కరుపయ్య లైంగికంగా వేధించాడు.
అంజలి ప్రతిఘటించడంతో ఆగ్రహానికి లోనైన కరుపయ్య తల్లీకూతుళ్లను తీవ్రంగా కొట్టి ఆపై ఇద్దరినీ సజీవ దహనం చేశాడు. ఘటన సమాచారం అందగా అక్కడికి చేరుకున్న స్ధానికులు కరుపయ్యను తీవ్రంగా గాయపరచగా దిండిగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి భర్త శివకుమార్ పిర్యాదు ఆధారంగా కరుపయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మకం చేశారు.