కోల్కతా : అధికారుల కండ్లుకప్పి గోల్డ్ స్మగ్లింగ్ యధేచ్చగా సాగించేందుకు అక్రమార్కులు అడ్డదారుల్లో చెలరేగుతున్నారు. మాల్దా నుంచి సిలిగురికి బస్సులో వెళుతున్న వ్యక్తిని ఉత్తర బెంగాల్ యూనివర్సిటీ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి భారీగా బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు తన అండర్వేర్లో రూ 1.7 కోట్ల విలువైన గోల్డ్ బిస్కెట్లను దాచి అక్రమంగా తరలిస్తున్నాడని సమాచారం అందడంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు వలపన్ని పట్టుకున్నారని ప్రభుత్వ న్యాయవాది రతన్ బానిక్ వెల్లడించారు.
ఒక్కో బంగారు బిస్కెట్ 16 గ్రాముల బరువుందని వీటి మార్కెట్ విలువ రూ 1,71,87,640 ఉంటుందని తెలిపారు. అరెస్ట్ చేసిన అనంతరం నిందితుడిని సిలిగురి కోర్టులో హాజరు పరిచారు. ఈ ఘటనపై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.