భోపాల్ : మధ్యప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. మేనకోడలు వరసైన మైనర్ బాలికపై ఐదేండ్లుగా లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం రెవాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి మొబైల్ ఫోన్లో నుంచి బాలిక అభ్యంతరకర వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని లాలన్ మిశ్రాగా గుర్తించారు. ఐదేండ్లుగా దారుణం జరుగుతున్నా భయంతో బాలిక ఈ విషయాన్ని బయటపెట్టలేదు. నిందితుడి తీరుతో విసిగిన బాలిక చివరకు కుటుంబసభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.