న్యూఢిల్లీ : యువతి పేరుతో ఇన్స్టాగ్రాం ఖాతా తెరిచి ఆపై ఆ అకౌంట్లో అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్న బీసీఏ విద్యార్ధి (22)ని డిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తంనగర్కు చెందిన బాధితురాలు నిందితుడిపై ద్వారకా సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఏప్రిల్ 1న తనకు పలు నెంబర్ల నుంచి అభ్యంతరకర కాల్స్ వచ్చాయని ఆపై తన పేరుతో నకిలీ ఇన్స్టాగ్రాం ఖాతా తెరిచి తన ఫోటోలను పోస్ట్ చేసినట్టు గుర్తించానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఐటీ ప్రొఫెషనల్‌గా పనిచేసే బాధితురాలు ఆరోపించారు.
తన మొబైల్ నెంబర్లను కూడా ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేశారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి. నకిలీ ఇన్‌స్టా ఖాతాను విశ్లేషించిన పోలీసులు టెక్నికల్ ఎనాలిసిస్ ఆధారంగా ఉత్తంనగర్లో దాడులు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని ఆ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసించే అంకిత్ కుమార్‌గా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా అంకిత్ నేరాన్ని అంగీకరించాడు.
తన గర్ల్‌ఫ్రెండ్, బాధితురాలు స్నేహితులని, మార్చి 30న తాను వద్దని వారించినా తన గర్ల్‌ఫ్రెండ్ బాధితురాలి బర్త్‌డే పార్టీకి వెళ్లిందని చెప్పాడు. తనకూ, బాధితురాలి మధ్య వాగ్వాదం జరగ్గా తన గర్ల్‌ఫ్రెండ్ ఎదుటే ఆమె తనను అవమానించిందని తెలిపాడు. బాధితురాలిపై పగ తీర్చుకునేందుకు తాను ఆమె పేరిట నకిలీ ఇన్స్టాగ్రాం ఖాతా ఏర్పాటు చేసి ఆమె ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి అభ్యంతరకర మెసేజ్‌లను ఆమె ఫాలోయర్లకు పంపానని చెప్పుకొచ్చాడు.