న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక ప్రమాదం ఒళ్లు జలదరింపజేస్తున్నది. పోష్ ఏరియా అయిన గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న కారు రోడ్డు దాడుతున్న ఒక వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతడు ఆ కారు బానెట్‌పై పడ్డాడు. అయితే డ్రైవర్ కారును నిలుపక డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. కారు కొంత దూరం వెళ్లాక బానెట్‌పై వేలాడుతున్న వ్యక్తి పక్కకు జారి రోడ్డుపై పడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. గాయపడిన వ్యక్తిని 37 ఏండ్ల ఆనంద్ విజయ్ మండేలియాగా గుర్తించారు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆనంద్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటన అక్కడున్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఆనంద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఆనంద్‌ను కారుతో ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.