అహ్మదాబాద్: ముస్లిం భార్య, ఆమె సోదరుడు కలిసి బలవంతంగా గొడ్డు మాంసం తినిపించడంతో హిందూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్లో రెండు నెలల కిందట జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సూరత్‌కు చెందిన రోహిత్ ప్రతాప్ సింగ్, ముస్లిం మహిళ సోనమ్ కలిసి ఒకేచోట పనిచేశారు. దీంతో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. తల్లిదండ్రులు వ్యతిరేకించినప్పటికీ సోనమ్‌ను రోహిత్ పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి జీవిస్తున్న అతడు ఏడాదిగా తన కుటుంబానికి దూరంగా ఉన్నాడు.
కాగా, జూన్‌లో భార్య సోనమ్, ఆమె సోదరుడు అఖ్తర్ అలీ కలిసి బెదిరించి బలవంతంగా రోహిత్‌తో గొడ్డు మాంసం తినిపించారు. దీనిని తట్టుకోలేని అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు ముందు రోహిత్ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన సూసైడ్ నోట్ ఇటీవల బయటపడింది. ‘నేను ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను. నా చావుకు కారణం నా భార్య సోనమ్ అలీ, ఆమె సోదరుడు అక్తర్ అలీ. నాకు న్యాయం చేయాలని నా స్నేహితులందరినీ కోరుతున్నా. నన్ను చంపేస్తానని బెదిరించి బీఫ్ తినిపించారు. ఇక ఈ లోకంలో జీవించే అర్హత నాకు లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని ఆ సూసైడ్ నోట్లో ఉంది.
మరోవైపు రోహిత్ బంధువులు ఇటీవల ఫేస్బుక్లో ఈ సూసైడ్ నోట్‌ను గుర్తించారు. ఈ విషయాన్ని అతడి తల్లి వీణా దేవికి చెప్పారు. దీంతో రోహిత్ భార్య సోనమ్, ఆమె సోదరుడిపై సూరత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది. దీంతో సోనమ్, ఆమె సోదరుడు అఖ్తర్ అలీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.