హయత్‌నగర్ : షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఫుట్‌వేర్ షాపులో మంటలు చెలరేగడంతో సామగ్రి కాలిబూడిదైంది. దాదాపు 4 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. హయత్‌నగర్ ఫైర్‌స్టేషన్ అధికారి సీనయ్య తెలిపిన వివరాల ప్రకారం..
హయత్‌నగర్, కుంట్లూరులో మహాలక్ష్మి ఫుట్‌వేర్ షాపును హెచ్.ప్రకాష్ గత కొంతకాలంగా నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం ఫుట్‌వేర్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి చుట్టుపక్కల దట్టమైన పొగలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది టాటిన అక్కడికి చేరుకుని దుకాణంలో చెలరేగుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు రూ.4 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు పోలీసులు అంచనా వేశారు.