న్యూఢిల్లీ: వ్యక్తిగత గొడవలను మనుసులో పెట్టుకుని ఢిల్లీలో ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. తనతో గొడవపడిన బంధువు భార్యకు సంబంధించిన ఫొటోలను అసభ్యంగా సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ ఆమెను మానసికంగా వేధించాడు. చివరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాల పాలయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని జగత్ పుర్ పుస్తా ఏరియాకు చెందిన హితేన్కు తన బంధువుతో గొడవ జరిగింది. దాంతో అతనిపై కక్షగట్టిన హితెన్ బంధువు భార్యను ఫేక్ అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేశాడు. ఆన్లైన్లో ఆమె ఫొటోలను డౌన్లోడ్ చేసుకుని, మార్ఫింగ్ చేశాడు. ఆమె ముఖానికి అశ్లీల చిత్రాల్లోని యువతుల నగ్న ఫొటోలను జతచేసి బాధితురాలికే ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. బాధితురాలి భర్త స్నేహితులకు కూడా కొన్ని ఫొటోలు పంపించాడు.
ఇలా సమాజంలో ఆమె పరువు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. గత ఎనిమిది నెలలుగా ఇదే తంతు కొనసాగుతుండంతో విసిగిపోయిన బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె బంధువే ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు కంప్యూటర్ ఐపీ అడ్రస్ ద్వారా గుర్తించారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.