హైదరాబాద్ : సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్ని ప్రమాదానికి సంబంధించి క్లూస్ టీమ్ ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనానికి ఛార్జింగ్ పెట్టారని, చార్జింగ్ ఫుల్ అయ్యాక పొగ వచ్చినట్లు క్లూస్ టీమ్ తేల్చింది. ఆ తర్వాత మంటలు చెలరేగి క్రమంగా పక్కనే ఉన్న ఇతర వాహనాలకు అంటకున్నట్లుగా నివేదికలో పేర్కొన్నది. బ్యాటరీలోని లిథియం అయాన్ రసాయనం వల్లే పెద్ద ఎత్తున పొగలు వచ్చినట్లు నివేదిక తెలిపింది.
సెల్లార్‌లోని లాడ్జిలోని నాలుగో అంతస్తు వరకు పొగ కమ్ముకుందని, ఆ పొగను పీల్చడం ద్వారానే ల్జాడిలో ఉన్న వారు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు క్లూస్ టీమ్ నివేదిక వెల్లడించింది. అయితే, పొగను ఎక్కువగా పీల్చిన ఎనిమిది మంది మృతి చెందినట్లు గుర్తించినట్లు క్లూస్‌టీమ్ పేర్కొంది. మంటలు మాత్రం సెల్లార్ వరకే పరిమితమయ్యాయని, మంటల వల్ల ఎవరూ చనిపోలేదని క్లూస్ టీమ్ ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది.