గౌహతి: కాబోయే భర్తని పోలీస్ అధికారిణి అరెస్ట్ చేయించింది. అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ జున్మోని రాభాకు, రానా పోగాగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా పరిచయం చేసుకున్న అతడితో గత ఏడాది అక్టోబర్లో ఎంగేజ్మెంట్ జరిగింది. నవంబర్లో వారిద్దరికి పెళ్లి నిశ్చయమైంది. అయితే కాబోయే భర్త మోసగాడన్న సంగతి ఎస్ఐ జున్మోనికి ఆ తర్వాత తెలిసింది. ఓఎన్జీసీలో పని చేస్తున్నానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన రానా, పలువురిని మోసగించి కోట్లలో డబ్బులు వసూలు చేశాడు. ఈ విషయం ఆ పోలీస్ అధికారిణి దృష్టికి వచ్చింది. దీంతో ఆమె ఆలస్యం చేయకుండా కాబోయే భర్తపై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అస్సాం పోలీసులు రానా పోగాగ్ను గురువారం అరెస్ట్ చేశారు.
మరోవైపు తన కళ్లు తెరిపించిన ముగ్గురు వ్యక్తులకు ఎస్ఐ జున్మోని రాభా ధన్యవాదాలు తెలిపారు. తనకు కాబోయే భర్త రానా పోగాగ్ పెద్ద మెసగాడన్న సంగతిని వారు చెప్పారని మీడియాతో ఆమె అన్నారు. కాగా, ఈ పోలీస్ అధికారిణి ఈ ఏడాది జనవరిలో వార్తల్లో నిలిచారు. బిహ్పురియా ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్ పిలుపు మేరకు చట్ట ఉల్లంఘనకు పాల్పడిన బీజేపీ నేతలకు మద్దతు ఇచ్చేందుకు ఆమె నిరాకరించారు.