Train | టికెట్ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో టికెట్ చెకర్ ఓ సైనికుడిని కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బరేలీ జంక్షన్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
భారత సైన్యంలో పనిచేసే సోనూ.. దిబ్రుఘడ్-ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) సుపాన్ బోర్ అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య టికెట్ విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అదికాస్తా గొడవగా మారింది. ఈ క్రమంలో కోపానికి గురైన సుపాన్… సోనూను కదులుతున్న ట్రైన్లో నుంచి ఒక్కసారిగా కిందకు తోసేశాడు. ప్రమాదంలో సోనూకు తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు సుపాన్ను చితకబాది.. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సోనూను చికిత్స నిమిత్తం ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో సోనూ తన కాలిని పోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని.. చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.