Gun fire In California | అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని సక్రామెంట్ నగరం ఉలిక్కి పడింది. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు జరిగిన కాల్పుల ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో 10 మంది గాయ పడ్డారు. రోడ్డుపై కొందరు వ్యక్తుల మధ్య మొదలైన పెనుగులాట కాల్పులకు దారి తీసింది. ఈ దృశ్యాలను ఆన్లైన్లో కొందరు వ్యక్తులు పోస్ట్ చేశారు. గాయపడిన వారిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయలేదని, కేసు దర్యాప్తు సాగుతున్నదని పోలీసులు తెలిపారు.
ఇది భయానక ఘటన అని సామాజిక కార్యకర్త బ్యారీ అక్యూయిస్ పేర్కొన్నాడు. అస్తవ్యస్తంగా మారిన దృశ్యాలను చూస్తే భయం గొలుపుతుందన్నాడు. మృతుల ఆప్తుల ఆర్తనాదాలతో ఈ ప్రాంతం మార్మోగిపోయిందన్నాడు. బాధితులు తమ సోదరుడు ఎక్కడని బోరుబోరుమంటున్నారని.. తమ పిల్లల ఆచూకీ కోసం తల్లుల ఆర్తనాదాలతో ఈ ప్రాంతం హోరెత్తి పోయిందన్నాడు.
ఈ ప్రాంతంలో తుపాకీకాల్పులు వినగానే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని సక్రామెంట్ పోలీస్ చీఫ్ కథీ లెస్టర్ మీడియాకు చెప్పారు. ఈ ప్రాంతంలో జనం రద్దీగా ఉన్నారని, ఈ దుర్ఘటన క్లబ్లో జరిగిందా. ఒక ఈవెంట్లో జరిగిందా ఇంకా తెలుసుకోలేదన్నారు. సాక్రామెంట్ మేయర్ డార్రెల్ స్టెయిన్ బర్గ్ మాట్లాడుతూ ఈ విషాదాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదని చెప్పారు.