కావలసిన పదార్థాలు :
బ్రెడ్ ముక్కలు: నాలుగు, శనగ పిండి: ఒక కప్పు, ఆలుగడ్డలు: రెండు (పెద్దవి), ఉల్లిగడ్డ: ఒకటి, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు: ఒక రెబ్బ, కొత్తిమీర తురుము: కొద్దిగా, వాము: అర టీస్పూన్, వంటసోడా: చిటికెడు, ఉప్పు: తగినంత, పసుపు: పావు టీస్పూన్, జీలకర్ర, ఆమ్చూర్, మిరియాల పొడి, కారం, చాట్ మసాలా, ధనియాల పొడి: అర టీస్పూన్ చొప్పున, నూనె: వేయించడానికి సరిపడా, టమాట సాస్, గ్రీన్ చట్నీ: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున.
తయారీ విధానం :
ఆలుగడ్డను ఉడికించి పొట్టుతీసి మెత్తగా మెదపాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి.. వేడయ్యాక జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. బాగా వేగాక ఆలుగడ్డ ముద్ద, కారం, పసుపు, చాట్‌మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, ఆమ్చూర్, ఉప్పు వేసి కలగలిపి.. తక్కువ మంటపై కలుపుతూ అయిదు నిమిషాలు వేయించాలి. చివరగా కొత్తిమీర తురుము వేసి దించేయాలి. ఒక గిన్నెలో శనగపిండి, వాము, ఉప్పు, వంటసోడా వేసి తగినన్ని నీళ్లు పోసి జారుగా కలపాలి.
బ్రెడ్ ముక్కల అంచులు తీసేయ్యాలి. ఒక్కో బ్రెడ్ ముక్క తీసుకుని ఒకవైపు గ్రీన్ చట్నీ, టమాట సాస్ రాసి పైనుంచి ఆలుగడ్డ మిశ్రమం పెట్టి ఒకదానిపై ఒకటి జోడించి నాలుగు ముక్కలుగా కత్తిరించాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడి చెయ్యాలి. ఆలుగడ్డ మిశ్రమం కూరిన బ్రెడ్ ముక్కల్ని శనగపిండి మిశ్రమంలో ముంచి.. కాగిన నూనెలో రెండువైపులా కాల్చుకుంటే వేడివేడి ఆలూ బ్రెడ్ బజ్జీ సిద్ధం.