‘చురాలియా హై తుమ్కో..’ పాట ఎప్పటికీ తన ‘ఫేవరేట్ సాంగ్’గానే ఉంటుందని చెబుతున్నది అలనాటి అందాల తార జీనత్ అమన్. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ ఈవెంట్‌కు హాజరైనా.. ఈ పాట తప్పకుండా ప్లే అవుతుందని చెప్పుకొచ్చింది. తాజాగా, ఈ పాటతో ఉన్న అనుబంధాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నది జీనత్. ‘యాదోంకీ బారాత్ సినిమా విడుదలైన తర్వాత.. ‘చురాలియా’ పాట ఓ సెన్సేషన్‌గా మారింది. ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ లిస్ట్‌లో చేరింది. అయితే.. దీనికి నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు.
ఎందుకంటే.. ఆ కాలానికి చెందిన లెజెండ్స్ అందరూ ఈ పాట కోసం పనిచేశారు. సంగీత దర్శకుడు.. ద గ్రేట్ ఆర్డీ బర్మన్. పాట రాసింది మజ్రూహ్ సుల్తాన్‌పురీ. ఇక లెజండరీ సింగర్స్ ఆశా భోంస్లే, మొహమ్మద్ రఫీ గొంతులు.. పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి’ అంటూ రాసుకొచ్చింది.
ఇక ఇందులో తన ఔట్ఫిట్ గురించి చెబుతూ.. ఈ పాటకు ముందు సన్నివేశంలో తాను టైట్ పింక్ సల్వార్ కమీజ్‌లో కనిపిస్తాననీ, ఈ డ్రెస్ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందని చెప్పింది. ఆ ఔట్ఫిట్ వేసుకోవడానికి తాను సినిమా డైరెక్టర్ నాజిర్ హుస్సేన్‌తో గొడవ కూడా పడ్డానని నాటి సంగతులను గుర్తుచేసుకున్నది.
ఇక బాంబేలో పుట్టి పెరిగిన జీనత్.. చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. 19 ఏళ్లకే ‘మిస్ ఆసియా పసిఫిక్’ అవార్డును దక్కించుకున్న మొదటి భారతీయురాలిగా రికార్డు సృస్టించింది. ‘హరే రామ హరే కృష్ణ’లాంటి భారీ హిట్ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత డాన్, యాదోంకీ బారాత్, కుర్బానీ, సత్యం శివం సుందరం, ధరం వీర్ వంటి హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నది. అయితే, టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పేసింది.