హిందీ చిత్ర పరిశ్రమలో నెపొటిజంపై విమర్శలు వస్తున్నా…వారసులు రాణిస్తూనే ఉన్నారు. ఒక్కో విజయాన్ని సాధిస్తూ సారా అలీ ఖాన్ కూడా స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. తాజాగా ఆమెకు మరో విజయం చేజిక్కింది. వికీ కౌశల్‌తో కలిసి ఆమె నటించిన ‘జర హట్కే జర బచ్కే’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తున్నది. గత వారం దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు బీ, సీ సెంటర్స్ నుంచే కాక మలీఫ్లెక్సుల నుంచి కూడా చెప్పుకోదగిన స్పందన వస్తున్నది.
సోమవారంతో కలుపుకుంటే ఈ సినిమా మొత్తం 26 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో రిలీజ్ ముందు ఈ సినిమా మీద పెట్టుకున్న అంచనాలకు మించి విజయాన్ని సాధించిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్‌తో కలిసి మ్యాడాక్ ఫిలింస్ నిర్మించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. కొత్త దంపతులు కపిల్, సౌమ్య వైవాహిక జీవితం నుంచి విడిపోయేందుకు చేసే ప్రయత్నాలతో ఇండోర్ నేపథ్యంగా సాగిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.