Sanam Shetty | చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ కారణంగా తాము ఇబ్బందులు పడ్డామని పలువురు హీరోయిన్లు, నటీమణులు తెలిపారు. ఇండస్ట్రీలో తమకు ఎదురైన వేధింపులు, చేదు అనుభవాలను బయటపెట్టారు. మరికొందరు క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై పోరాటం చేస్తున్నారు. మరికొందరు తమకు అలాంటి ఇబ్బందులు ఎదురవలేవని చెబుతున్నారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై యువ నటి గొంతెత్తారు. తమిళ చిత్ర పరిశ్రమలోనూ నటీమణులకు ఇబ్బందులు తప్పడం లేదని సనమ్ శెట్టి తెలిపారు. పేరొందిన చిత్ర పరిశ్రమల్లో మాదిరిగానే తమిళ చిత్ర పరిశ్రమలో మహిళలు దర్శకులు, నిర్మాతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తమిళ ఇండస్ట్రీలో మహిళలతో పాటు పురుషులపై సైతం లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కోల్‌కతాలో వైద్య విద్యార్థిని లైంగిక దాడి, హత్య ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. వైద్య విద్యార్థిని లైంగిక హత్యాచార ఘటనను నిరసిస్తూ ర్యాలీ చేపట్టాలనుకుంటున్న సనమ్ తెలిపారు. ఈ మేరకు పోలీసులకు దరఖాస్తు చేసినట్లు చెప్పారు. అన్ని రంగాల్లోనూ మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నారన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొంటున్న క్యాస్టింగ్ కౌచ్‌ను ఉద్దేశించి ఇటీవల జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదికను చేసిందని.. ఈ నివేదిక గురించి తెలిసి తాను షాక్ అయ్యాయని తెలిపారు. అవే పరిస్థితులు కోలీవుడ్‌లోనూ ఉన్నాయని.. వాటిని బయటపెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని.. తాను ఇలాంటి ఘటనలు ఎదుర్కొన్నానని చెప్పింది.
అయితే, ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడే ఎందుకు మాట్లాడారంటూ చాలా మంది అంటుంటారని.. కొన్ని పరిస్థితుల కారణంగా బయటకువచ్చి మాట్లాడలేమని సనమ్ చెప్పుకొచ్చారు. రెండురోజుల కిందట పోస్ట్‌లో తన వ్యక్తిగత అనుభవం గురించి చెప్పానన్నారు. నాకు ఇదే సమస్య వచ్చిన సమయంలో అడ్జస్ట్మెంట్ అడిగిన వ్యక్తిని ‘చెప్పుతో కొడతాను కుక్క’ అని చెప్పి ఫోన్ కట్ చేశానన్నారు. అయితే, తమిళ ఇండస్ట్రీలో ఉన్న వారంతా చెడ్డవారు కాదని.. కొందరు తప్పుడు అర్థంతో మాట్లాడుతున్నారన్నారు. తాను ప్రస్తుతం చేసిన ప్రాజెక్టుల్లో వందశాతం మంచి వ్యక్తులు ఉన్నారని చెప్పింది. సనమ్ శెట్టి మొదట మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. మిస్ సౌత్ ఇండియా టైటిల్‌ను నెగ్గింది. 2012లో తమిళ మూవీ ‘అంబులి’ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది. తెలుగులో శ్రీమంత్రుడు, సింగం 123, ప్రేమికుడు సినిమాల్లో నటించింది.