‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు కన్నడ అగ్ర నటుడు యష్. ఆయన తదుపరి సినిమా తాలూకూ అప్డేట్ శుక్రవారం వెలువడింది. ఈ చిత్రానికి ‘టాక్సిక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జాతీయ అవార్డు గ్రహీత గీతూమోహన్ దాస్ దర్శకత్వం వహించనుంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ నారాయణ్ నిర్మించబోతున్నారు. శుక్రవారం సినిమా తాలూకు గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘నువ్వు వెతుకుతున్నది..నిన్ను కోరుకుంటున్నది’ అంటూ తన సోషల్‌మీడియా ఖాతాలో ఈ సినిమా గురించి వ్యాఖ్యానించారు యష్. రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా ఈ సినిమా ఉంటుందని దర్శకురాలు పేర్కొంది. డ్రగ్స్ నేపథ్య కథాంశమిదని సమాచారం. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.