“కేజీఎఫ్’ తర్వాత మిమ్మల్ని కలవలేదు. ప్రతిభ ఉంటే భాష గురించి కూడా పట్టించుకోరు తెలుగు ప్రేక్షకులు. నాలాంటి నటులు ఎలాంటి ప్రయోగాన్నైనా చేయొచ్చనే ధైర్యాన్నిచ్చిన గొప్ప మనసు మీది. మేమంతా గ్లోబల్ మ్యాప్‌లో ఇండియన్ సినిమాను మార్క్ చేయాలనుకొని ‘టాక్సిక్’ చేశాం. ప్యాషనేట్ ప్రొడ్యూసర్ వెంకట్ కె.నారాయణ. అద్భుతంగా సినిమాను నిర్మించారు. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుంది. టాక్సిక్ ఈజ్ బోల్డ్.. టాక్సిక్ ఈజ్ ఒరిజినల్.. టాక్సిక్ ఈజ్ పాత్ బ్రేకింగ్.. టాక్సిక్ ఈజ్ బ్లోయింగ్ మైండ్. తెలుగు ప్రేక్షకులు నాకిచ్చిన శక్తికి తగ్గ విధంగా మరింత గొప్పగా, అంచనాలను మించి ‘టాక్సిక్’ ఉంటుంది’ అని అగ్ర కథానాయకుడు ‘కేజీఎఫ్’ఫేం యశ్ అన్నారు. ఆయన హీరోగా నటించి.. వెంకట్ కె.నారాయణతో కలిసి నిర్మించిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకురాలు.
కియారా అద్వానీ, నయనతార, రుక్మిణీవసంత్ కథానాయికలు. హ్యూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రధారులు. ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కానున్నది. తెలుగు వెర్షన్‌ని దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో యశ్ మాట్లాడారు. చిత్ర నిర్మాత వెంకట్ కె.నారాయణ మాట్లాడుతూ ‘ఇది సినిమా మాత్రమే కాదు. ఒక అనుభూతి. విమర్శలకు అందని స్థాయిలో సినిమా ఉంటుంది. ఇండియన్ సినిమా స్థాయిని పెంచాలనే యశ్ ఆకాంక్షకు ప్రతిరూపం ‘టాక్సిక్” అని పేర్కొన్నారు. ఇంకా కియారా అద్వానీ, రుక్మిణీ వసంత్, హ్యూమా ఖురేషి, సుదేవ్, అక్షయ్ ఓబెరాయ్, మ్యూజిక్ డైరెక్టర్స్ రవి బస్రూర్, విశాల్మిశ్రా, గీత రచయిత రామజోగయ్యశాస్త్రిలతోపాటు బీఆర్ఎస్ నాయకుడు, మేడ్చల్ శాసనసభ్యుడు సీహెచ్ మల్లారెడ్డి, దిల్ రాజు, శిరీష్ కూడామాట్లాడారు.