Yash | ‘కేజీఎఫ్’ సినిమాలతో భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యశ్.. ఇప్పుడు ‘టాక్సిక్’తో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ‘రాకీ భాయ్’గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న యశ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుంచే నటనపై తనకు ఎంతో ఆసక్తి ఉండేదని యశ్ తెలిపారు. అయితే నటుడు కావాలన్న తన నిర్ణయానికి కుటుంబం అంగీకరించలేదని చెప్పారు. దీంతో ఎలాగైనా తన కలను నెరవేర్చుకోవాలనే పట్టుదలతో తండ్రి జేబులో నుంచి రూ.300 తీసుకుని బెంగళూరుకు వెళ్లినట్లు గుర్తుచేసుకున్నారు.
బెంగళూరుకు వెళ్లిన తర్వాత ఓ నాటక బృందంలో పనిచేస్తూ నటనలో అనుభవం సంపాదించుకున్నారు. ఆ తర్వాత ‘నందగోకుల’ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని.. ‘మొగ్గిన మనసు’ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. తనను విమర్శించినవారి మాటలను తాను పెద్దగా పట్టించుకోనని, ‘నువ్వు సాధించలేవు’ అని ఎవరైనా అంటే అదే విషయాన్ని సాధించి చూపించాలనే పట్టుదల తనలో ఉంటుందని యశ్ చెప్పారు. యశ్ తన భార్య, నటి రాధికా పండిట్‌తో ఉన్న ప్రేమకథను కూడా గుర్తుచేసుకున్నారు. ఇద్దరూ తొలినాళ్లలో కలిసి సినిమాలు చేసినప్పటికీ పెద్దగా మాట్లాడుకునేవారు కాదని తెలిపారు. క్రమంగా వారి పరిచయం స్నేహంగా మారిందని చెప్పారు.
ఓ వాలెంటైన్స్ డే సందర్భంగా రాధికకు నచ్చే వస్తువులతో ఓ గిఫ్ట్ హ్యాంపర్‌ను సిద్ధం చేసి ఆమె కారు వద్ద పెట్టినట్లు యశ్ తెలిపారు. ఆ తర్వాత ఫోన్ చేసి తన మనసులోని ప్రేమను వెల్లడించానని చెప్పారు. అయితే తన ప్రేమను అంగీకరించడానికి రాధిక ఏకంగా ఆరు నెలల సమయం తీసుకున్నారని నవ్వుతూ వెల్లడించారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన కెరీర్‌ను ‘కేజీఎఫ్’కు ముందు, ఆ తర్వాతగా విభజించవచ్చని యశ్ అభిప్రాయపడ్డారు. ‘కేజీఎఫ్’ తన కెరీర్‌ను మాత్రమే కాకుండా భారతీయ సినిమాపై తన దృక్పథాన్ని కూడా మార్చిందని పేర్కొన్నారు. ‘కేజీఎఫ్-3’ కచ్చితంగా ఉంటుందని యశ్ స్పష్టం చేశారు. అయితే మూడో భాగం రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి ఇతర ప్రాజెక్టులపై ఉందని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’పై భారీ అంచనాలు ఉన్నాయి.