Lucifer 2 Empuraan | మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్ (L2 Empuraan). ఈ సినిమాకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహించాడు. మంజు వారియర్ (Manju Warrier),టోవినో థామస్(Tovino Thomas), ప్రధాన పాత్రల్లో నటించారు. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ (Lucifer) సినిమాకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మలయాళ సినమాలోనే ఆల్‌టైం కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ మూవీకి సంబంధించి కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై చిత్ర రచయిత మురళీ గోపీ స్పందించారు.
ఈ సినిమాలో 2002లో గుజరాత్లో జరిగిన గోద్రా సంఘటనలో జరిగిన ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే ఈ మూవీలో నటించిన సయ్యద్ మసూద్ అనే పాత్రకి సంబంధించి అతడి కుటుంబాన్ని ఒక వర్గానికి చెందిన నాయకుడు చంపడంతో పాటు హత్యచారం చేయడం.. ఆ తర్వాత అతడు రాజకీయ రంగంలోకి ప్రవేశించి పెద్ద నాయకుడిగా ఎదగడం చూపించారు. అయితే సీన్స్‌పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వర్గాన్ని అవమానకరంగా చిత్రీకరించే విధంగా ఈ దృశ్యాలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.
దీంతో ఈ వివాదంపై స్పందించిన మురళీ గోపీ మాట్లాడుతూ.. ఈ విషయంలో నేను పూర్తిగా మాట్లాడకుండా ఉండాలని అనుకుంటున్నాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఒక సినిమాని తమకు నచ్చిన రీతిలో ఊహించుకునే హక్కు ప్రతిఒక్కరికీ ఉంది. కాబట్టి, వారు తమకు నచ్చినట్లు ఊహించుకోనివ్వండి. నేను మాత్రం ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉంటాను’’ అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, వామపక్ష భావజాలం కలిగిన సంస్థలపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు ఎప్పుడో తమ సిద్ధాంతాలను పక్కనపెట్టేశారని ఆయన వ్యాఖ్యానించారు.