‘మహాబలిపురంలో ఉన్న నా పది ఎకరాల స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి.. ఇలా పలువురు వ్యక్తులకు అమ్మానని నాపై కేసు పెట్టారు. 14ఏళ్లు ఈ విషయంపై న్యాయపోరాటం చేశా. చివరకు అది తప్పుడు కేసు అని తేలింది. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది.’ అంటూ ఆనందం వెలిబుచ్చారు నిర్మాత శింగనమల రమేష్‌బాబు. కొమరంపులి, ఖలేజా చిత్రాలతోపాటు పలు విజయవంతమైన చిత్రాలను కూడా నిర్మించారాయన. పైన ఆయన పేర్కొన్న కేసులో 14ఏండ్ల పాటు న్యాయస్థానంలో విచారణ జరుగగా.. ఎట్టకేలకు గత నెల 31న శింగనమల రమేష్ నిర్దోషి అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా తన భవిష్యత్ కార్యకలాపాలను వివరించడానికి బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో రెండు భారీ చిత్రాలు నిర్మించి వందకోట్లు నష్టపోయానని, ఇక నుంచి కథను నమ్ముకొని సినిమాలు చేయాలనుకుంటున్నానని, తన కుమారులు కూడా పరిశ్రమలోనే సెటిల్ అయ్యారని రమేష్ తెలిపారు. ‘ఫిల్మ్ ఫైనాన్షియర్‌ని అయిన నేను.. సినిమాపై పాషన్‌తో నిర్మాతగా మారాను. సినిమా నాకు తల్లి. ఇకనుంచి మంచి కథలతో సినిమాలు చేయాలనుకుంటున్నాను.’ అని శింగనమల చెప్పారు.