పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ప్రముఖ నటుడు మోహన్‌బాబు సముచిత సత్కారం అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోల్‌కత్తాలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ‘గవర్నర్ అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్’ పురస్కారాన్ని విశిష్ట అతిథుల సమక్షంలో మోహన్‌బాబుకి పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనందబోస్ ప్రదానం చేశారు. ఈ వేడుకలో మోహన్‌బాబు కుమారుడు మంచు విష్ణు, నటుడు శివబాలాజీ కూడా పాల్గొన్నారు.
దేశమంతటా తెలుగు సినిమా ప్రభావం కనిపిస్తున్న నేటి తరుణంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక తెలుగు నటుడికి ఇటువంటి సత్కారాన్ని అందించడం గొప్ప గౌరవమని భావిస్తున్నారు. 50ఏండ్ల సినీ జీవితంలో సినిమారంగానికి మోహన్‌బాబు చేసిన విశేష సేవలను దృష్టిలో పెట్టుకొనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందించింది. ప్రస్తుతం మోహన్‌బాబు ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తున్నారు.