Tollywood Film Industry | బెంగాలీ సినిమా(టాలీవుడ్) ఇండస్ట్రీని కాపాడటానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని సినిమా హాళ్లు మరియు మల్టీప్లెక్స్‌లలో ప్రతిరోజూ ఒక బెంగాలీ సినిమాను తప్పనిసరిగా ప్రైమ్ టైమ్‌లో ప్రదర్శించాలని అన్ని థియేటర్ యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించింది.
ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. వెస్ట్ బెంగాల్లో ఉన్న థియేటర్‌తో పాటు మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య కనీసం ఒక బెంగాలీ సినిమా ప్రదర్శన ఉండాలంటూ ప్రకటన విడుదల చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వలన బెంగాలీ సినిమా పరిశ్రమను ప్రోత్సహించడంతో పాటు స్థానిక సినీ పరిశ్రమలో పెట్టుబడులు కూడా పెరుగుతాయని ఆశిస్తుంది.