“మత్తు వదలరా-2’ చిత్రానికి అంతటా మంచి ఆదరణ లభిస్తున్నదని..చిరంజీవి, మహేష్‌బాబు వంటి అగ్ర హీరోలు బాగుందని ప్రశంసించడం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని చెప్పారు చిత్ర దర్శకుడు రితేష్ రానా. శ్రీసింహా కోడూరి, సత్య ప్రధాన పాత్రల్లో రూపొందిన కామెడీ థ్రిల్లర్ ‘మత్తు వదలరా-2’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర దర్శకుడు రితేష్ రానా పాత్రికేయులతో మాట్లా డుతూ ‘సీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మంచి ఐడియా రావడంతో నిర్మాత చెర్రీగారికి చెప్పాను. ఆ పాయింట్ అందరికి నచ్చడంతో సీక్వెల్‌ను మొదలుపెట్టాం’ అన్నారు. సినిమాలో సింహా, సత్య, అజయ్ ఆద్యంతం చక్కటి కామెడీతో నవ్విస్తున్నారని, మత్తు అంటే కేవలం డ్రగ్స్ మాత్రమే కాదని, అది చాలా రకాలుగా ఉంటుందని, ఎలాంటి మత్తు నుంచి అయినా బయటపడాలనే అంతర్లీన సందేశంతో సినిమా తీశామని అన్నారు. ఫరియా అబ్దుల్లా చేసిన ర్యాప్‌సాంగ్ హైలైట్‌గా నిలిచిందని, ఆమెను దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్ డిజైన్ చేశానని రితేష్ రానా తెలిపారు. రాజమౌళిగారికి కూడా ఈ సినిమా బాగా నచ్చిందని, ఆయన సినిమాను బాగా ఎంజాయ్ చేశారని రితేష్ అన్నారు. ఈ సినిమాకు పార్ట్-3 కూడా ఉంటుందని, తన తదుపరి సినిమా వివరాలను త్వరలో తెలియజేస్తానని రితేష్ రానా పేర్కొన్నారు.