తెలుగు సినీ కార్మికుల సమ్మెతో టాలీవుడ్లో షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. నిర్మాతలు, ఎంప్లాయిస్ ఫెడరేషన్ మధ్య సరైన అవగాహన కుదరకపోవడంతో సమ్మె మరింత ఉధృతమైంది. ఈ నేపథ్యంలో సోమవారం పలువురు చిన్న నిర్మాతలు సమావేశమై కార్మికుల సమ్మె వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించారు. ఈ సమావేశంలో ఎస్కేఎన్, మధుర శ్రీధర్ రెడ్డి, రాజేశ్ దండా, వంశీ నందిపాటి, బెన్నీ, శరత్చంద్ర, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద నిర్మాతలతో పోల్చితే చిన్న నిర్మాతల కష్టాలు వేరుగా ఉంటాయని వారందరూ అభిప్రాయపడ్డారు. ఎస్కేఎన్ మాట్లాడుతూ.. కార్మికులు కోరినట్లు వేతనాలు పెంచుతామని, కానీ థియేట్రికల్ రెవెన్యూతో పాటు సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చే బాధ్యతను ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు.
ఆ భరోసాను కల్పిస్తే 50శాతమైన పెంచుతామని అన్నారు. ‘ఇండస్ట్రీలో 90 శాతం చిత్రాలు తీసేది చిన్న నిర్మాతలే. మేం పాన్ఇండియా సినిమాలు తీయడం లేదు. టికెట్ ధరల పెంపు వంటివి చిన్న నిర్మాతలకు వర్తించవు. షూటింగ్‌కు ఇంతమందిని తీసుకోవాలి. కోరినట్లు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసే హక్కు మీకెక్కడిది? మీరు మారకుంటే బడ్జెట్లో వచ్చే వాళ్లతో సినిమాలు నిర్మిస్తాం. కొంతమంది నిర్మాతలు తమ సొంత అజెండా అమలులో భాగంగా కార్మికుల వేతనాలు పెంచాలంటున్నారు. డైరెక్టర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎవరి వైపు ఉన్నారో స్పష్టత నివ్వాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చిన్న నిర్మాతల కష్టాలపై దృష్టిపెట్టాలి’ అన్నారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణం భారంగా మారుతున్నదని, అనుకున్న బడ్జెట్‌కు రెండింతలు అవుతున్నదని వంశీ నందిపాటి తెలిపారు.