అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘వార్ 2’ టీజర్ రానేవచ్చింది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ టీజర్‌ని విడుదల చేశారు. నాలుగురోజుల క్రితం ‘వార్ 2’ హీరోల్లో ఒకరైన హృతిక్ రోషన్ మే 20న అద్భుతమైన అప్డేట్ ఉంటుందని తన ఎక్స్(ట్విటర్) ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం విడుదలైన ఈ టీజర్ గురించే నాలుగురోజుల క్రితం ఆయన ఆ పోస్ట్ పెట్టారని అవగతమవుతోంది. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ టీజర్ విడుదలైంది. ఇందులో డైలాగులు, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేశాయని చెప్పొచ్చు. ‘నా కళ్లు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతున్నాయి కబీర్.. ఇండియాలో బెస్ట్ సోల్జర్..
రా లో బెస్ట్ ఏజెంట్.. నువ్వే.. కానీ ఇప్పుడు కాదు.. నీకు నా గురించి తెలీదు.. ఇప్పుడు తెలుసుకుంటావ్.. గెట్ రెడీ ఫర్ వార్..’ అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. హృతిక్కీ, ఎన్టీఆర్‌కీ మధ్య ఢీ అంటే ఢీ అనేలా ఇందులో పోరాటాలుంటాయని టీజర్ చెబుతున్నది. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్తోపాటు ఇద్దరు కలిసి చేసిన పోరాటాలు మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తాయని, సాంకేతిక విలువలు కూడా హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. యష్‌రాజ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.