Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’ ఇప్పటికే అనే సార్లు వాయిదా పడింది. ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్స్ లేవు, రిలీజ్ డేట్ చెప్పకపోయే సరికి ఈ సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు అందరిలో కలిగాయి. అయితే ఈ రోజు ఉదయం చిరంజీవి ఓ వీడియో ద్వారా మూవీ ఆలస్యానికి కారణం తెలియజేశారు. మీకు అత్యున్నత ప్రమాణాలతో, బెస్ట్ క్వాలిటీతో మూవీని మన ముందుకు తీసుకురావాలనే చిత్ర బృందం ఇంత సమయం తీసుకుంటుందని చిరంజీవి అన్నారు. ఇది చందమామ కథలాగా సాగిపోయే అద్భుతమై కథ. చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలకి ఈ సినిమా బాగా నచ్చుతుంది అని చిరంజీవి అన్నారు. ఇక మూవీని 2026 సమ్మర్‌కి విడుదల చేయనున్నట్టు చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చారు.
ఇక చిరంజీవి బర్త్ డే సందర్భంగా కొద్ది సేపటి క్రితం చిన్న గ్లింప్స్ విడుదల చేశారు. అసలేం జరిగిందో ఈ రోజైన చెబుతావా అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది. ఇందులో ప్రతి సన్నివేశం ఆకట్టుకునేలా ఉంది. గతంలో వీఎఫ్ఎక్స్ విషయంలో పలు విమర్శలు తలెత్తగా, తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తే ఆ తప్పులని సరిదిద్దుకున్నట్టుగా అనిపిస్తుంది. చిరు బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం భారత పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్. “మన పురాణాల ప్రకారం మొత్తం 14 లోకాలు ఉన్నాయని చెబుతారు. యమలోకం, పాతాళం, స్వర్గం వంటి వాటి వరకు సినిమాల్లో చాలామంది చూపించారు. కానీ ‘విశ్వంభర’లో ఆ 14 లోకాలకు మూలమైన ‘సత్యలోకాన్ని’ చూపించబోతున్నాం అని ఇటీవల దర్శకుడు చెప్పుకొచ్చారు. ఈ కథలో కథానాయకుడు ఆ లోకానికి ఎలా వెళ్తాడు? అక్కడి నుంచి కథానాయికను భూమిపైకి ఎలా తీసుకొస్తాడు? అన్న అంశం చుట్టూ సినిమా ఉంటుందని చెప్పాడు.
ఇది ఒక రకమైన మిస్టిక్ యాత్రగా ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌తో అద్భుతమైన సెట్స్ వేసి చిత్రీకరణ జరుపుతున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ప్రతీ సన్నివేశం గొప్ప విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడి ఉండేలా డిజైన్ చేస్తున్నారు. అందుకే ఇది చిరంజీవి కెరీర్లోనే అత్యంత విజువల్‌గా రిచ్ సినిమా అవుతుందని భావిస్తున్నారు. చిరంజీవికి జోడీగా త్రిష నటించగా, మరో కీలక పాత్రలో ఆషికా రంగనాథ్ కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నప్పటికీ, ఇది పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా విడుదల కానుంది.