యువ హీరో విశ్వక్సేన్ను కొత్త కథలకు కేరాఫ్ అడ్రస్‌గా చెబుతుంటారు. వాణిజ్య పంథాలోనే వినూత్న కథాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ ఈ నెల 22న విడుదలకానుంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో విశ్వక్సేన్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..
గత నాలుగైదేళ్లుగా జరుగుతున్న ఓ బర్నింగ్ పాయింట్‌ను ఈ సినిమాలో చర్చించాం. అదేమిటన్నది తెరపై చూస్తేనే సర్ప్రైజింగ్గా ఉంటుంది. అసలు ఇంతకాలం ఎవరు ఎందుకు టచ్ చేయలేదనిపిస్తుంది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఎవరూ ఊహించని విధంగా సాగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ థ్రిల్లర్ తరహాలో ఉత్కంఠను పంచుతుంది.
ట్రైలర్లో కథను పెద్దగా రివీల్ చేయలేదు. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ శాతం ఎక్కువగా ఉంటుంది. దర్శకుడు రవితేజ కొత్తవాడైనా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా చూసిన తర్వాత దర్శకుడిగా అతని పనితీరుని మెచ్చుకుంటారు. యథార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా కథ సాగుతుంది.
ఇది కేవలం హీరో క్యారెక్టర్ బేస్డ్ మూవీ కాదు. కథానాయికలు మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, రఘు, సునీల్‌తో పాటు అందరి పాత్రలకు సమప్రాధాన్యం ఉంటుంది. సునీల్‌గారితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది.
ఈ మధ్యే సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఇలాంటి సినిమాకు ప్రీమియర్స్ వేస్తే బాగుంటుందనిపించింది. పెద్ద ఎత్తున ప్రీమియర్ షోస్‌కు ప్లాన్ చేస్తున్నాం. మొన్న ప్రీరిలీజ్ వేడుకలో ట్రోలర్స్ గురించి మాట్లాడాను. నా మనసులో ఉన్న మాటలు చెప్పాను. కెరీర్ తొలినాళ్ల నుంచి నేను ఇలాగే ఉన్నా. డిప్లొమాటిక్‌గా ఉండటం నాకు తెల్వదు. ఉన్నదున్నట్లుగా మాట్లాడుతా. ఇందులో కొత్తగా నేర్చుకొని ప్రవర్తించేదీ ఏమీ లేదు. నా వ్యక్తిత్వమే అలాంటిది.
ప్రస్తుతం చేస్తున్న సినిమాల వివరాల్లోకి వెళ్తే..‘లైలా’ అరవైశాతం పూర్తయింది. అనుదీప్ దర్శకత్వంలో సినిమా జనవరిలో ప్రారంభమవుతుంది. ‘కల్ట్’ చిత్రాన్ని మార్చిలో మొదలుపెడతాం. ‘ఈ నగరానికి ఏమయింది’ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కుతుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నా.