Viral Vayyari | ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని బాగా ఊపేసిన సాంగ్ వైరల్ వయ్యారి. ‘వైరల్ వయ్యారి నేనే.. వయసొచ్చిన అణుబాంబును’ అనే పాటని ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్‌లలో చిన్నా-పెద్దా అనే తేడా లేకుండా ప్రతి వయస్సు వారు తమదైన స్టైల్లో డ్యాన్స్‌లు చేస్తూ అలరించారు. ఇటీవలే కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థిని ఈ పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేసి హీరో మనసు గెలుచుకుంది. చిన్నారి డ్యాన్స్ చూసి ఆకర్షితులైన కిరీటి, తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ చిన్నారిని మెచ్చుకున్నారు. అంతేకాదు, ఆమెకు ఒక చిన్న కానుక కూడా అందించారు.
ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పాటల్లో వైరల్ వయ్యారి సాంగ్ ముందు వరుసలో నిలిచింది . కిరీటి, శ్రీలీల జంటగా నటించిన జూనియర్ సినిమాలోని ఈ పాటకు యూట్యూబ్‌లోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ దక్కింది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఉత్సాహభరితమైన ట్యూన్స్‌కు కిరీటి, శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులు పర్ఫెక్ట్ మాస్‌తో మేళవించడంతో ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే లిరికల్ వర్షన్ అభిమానుల్ని ఊపేసింది. ఇప్పుడు తాజాగా ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో కూడా నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
జూనియర్ సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అయిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 18న తెలుగు, కన్నడ భాషలలో విడుదలైంది. ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ‘వైరల్ వయ్యారి’ పాటకు యువత విపరీతంగా స్పందిస్తోంది. శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్, కిరీటి స్టెప్పులకు అభిమానులు ఫిదా అయ్యారు.