Sri Sri Ravi Shankar | 12 ఫెయిల్, సబర్మతి ఎక్స్‌ప్రెస్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే (Vikrant Massey) మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది శ్రీ శ్రీ రవిశంకర్ (Spiritual leader Sri Sri Ravi Shankar) పాత్రలో విక్రాంత్ మాస్సే నటించబోతున్నాడు. వైట్ (White) అనే పేరుతో ఈ సినిమా రాబోతుండగా.. పాన్ వరల్డ్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు పఠాన్, వార్, ఫైటర్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, నిర్మాత మహావీర్ జైన్ కలిసి సంయుక్తంగా నిర్మించబోతుండగా.. మోంటూ బస్సీ (Montoo Bassi) దర్శకత్వం వహిస్తున్నాడు. హిందీ, ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో రాబోతున్న ఈ చిత్రం ఆగస్టులో షూటింగ్ ప్రారంభించనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా స్పందించాడు విక్రాంత్.
విక్రాంత్ మాట్లాడుతూ.. శ్రీ శ్రీ రవిశంకర్ లాంటి గొప్ప వ్యక్తి బయోపిక్‌లో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవం. ఈ సినిమాలో నేను కేవలం శ్రీశ్రీని అనుకరించడానికి మాత్రమే ప్రయత్నిస్తాను. ఆయనలా మారడం అసాధ్యం అని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం శ్రీ శ్రీ గురించి లోతుగా అధ్యయనం చేస్తున్నానని, ఆయన బోధనలు, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని విక్రాంత్ వెల్లడించారు. కొలంబియా సివిల్ వార్ సమయంలో శ్రీ శ్రీ రవిశంకర్ జోక్యం చేసుకుని హింస లేకుండా సంఘర్షణను పరిష్కరించిన విషయాలు ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఆగష్టులో సెట్స్ మీదకి వెళుతుందంటూ విక్రాంత్ చెప్పుకోచ్చాడు.