Thalapathy Vijay | తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘జన నాయగన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు.
ఆదివారం రిపబ్లిక్ డే సందర్భంగా టైటిల్ ప్రకటనతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో విజయ్ అభిమాన సమూహంతో సెల్ఫీ తీసుకుంటూ చిరునవ్వుతో కనిపిస్తున్నారు. రాజకీయ రంగప్రవేశం నేపథ్యంలో కెరీర్లో తనకు ఇదే చివరి చిత్రమని విజయ్ గతంలోనే ప్రకటించారు. దళపతి విజయ్ రాజకీయ సిద్ధాంతాలు, కార్యచరణను ఆవిష్కరించే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని సమాచారం. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.