విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ‘96’ (2018) చిత్రం హృద్యమైన ప్రేమకథగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తమిళంలో భారీ విజయాన్ని సాధించింది. త్రిష, విజయ్ సేతుపతి నటన ప్రధానాకర్షణగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ రానుందని తమిళ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతున్నది. తాజాగా ఈ విషయంపై చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్ ఆసక్తికరమైన అప్డేట్ను అందించారు. ‘96’ సీక్వెల్‌కు స్క్రిప్ట్ మొత్తం పూర్తయిందని, తొలి భాగానికి దక్కిన ఆదరణ దృష్ట్యా మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో కథను తీర్చిదిద్దానని చెప్పారు. త్రిష, విజయ్‌సేతుపతి ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉన్నారని, వారి డేట్స్ అందుబాటులోకి రాగానే ‘96’ చిత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ప్రేమ్ కుమార్ తెలిపారు. త్రిష సైతం ఈ సీక్వెల్లో నటించేందుకు సంసిద్ధంగా ఉందని తెలిసింది. ‘96’ చిత్రాన్ని తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేశారు. శర్వానంద్, సమంత జంటగా నటించారు. ప్రస్తుతం త్రిష.. విశ్వంభర, థగ్‌లైఫ్ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉంది.