Vijay- Sangeetha | తమిళనాడు రాజకీయాలు, కోలీవుడ్ వర్గాల్లో గత కొన్ని గంటలుగా ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ ఆయన భార్య సంగీత సోమలింగం మళ్లీ కలిసిపోయారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. గత కొంతకాలంగా వీరిద్దరి వైవాహిక జీవితంపై అనేక ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఈ వార్త అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో విజయ్ నటించిన సినిమాల ఆడియో లాంచ్‌లు, సక్సెస్ మీట్లు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలకు సంగీత తరచూ హాజరయ్యేవారు. అయితే ఇటీవల కాలంలో విజయ్ నిర్వహించిన రాజకీయ సభలు, పార్టీ కార్యక్రమాలు, పబ్లిక్ ఈవెంట్లలో ఆమె ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ముఖ్యంగా విజయ్ తన రాజకీయ పార్టీ కార్యకలాపాలను విస్తరించిన సమయంలో కూడా సంగీత దూరంగా ఉండటంతో, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు బలపడ్డాయి.
అంతేకాకుండా సంగీత లండన్‌లోనే నివసిస్తున్నారని, దంపతులు విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం కూడా తమిళ మీడియా వర్గాల్లో వినిపించింది. ఈ నేపథ్యంలో వారి వ్యక్తిగత జీవితంపై అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే వీటిపై కుటుంబ సభ్యులు లేదా విజయ్ కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యులు ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ తల్లి శోభ చంద్ర శేఖర్ ఈ విషయంలో కీలక పాత్ర పోషించారని కోలీవుడ్, రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కుటుంబ పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పడంతో పరిస్థితులు సానుకూలంగా మారినట్లు సమాచారం.
ఈ చర్చలు ఫలించడంతోనే సంగీత ఇటీవల లండన్ నుంచి చెన్నైకి తిరిగి వచ్చినట్లు, ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో విజయ్-సంగీత మళ్లీ తమ వ్యక్తిగత జీవితాన్ని కొత్తగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం మరింత ఊపందుకుంది.ఇదే సమయంలో గతంలో విజయ్ మరియు త్రిష పేర్లను ముడిపెడుతూ వచ్చిన పుకార్లు కూడా మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో విజయ్, త్రిష కలిసి కనిపించడంతో వారిద్దరి మధ్య ప్రత్యేక సంబంధం ఉందంటూ అప్పట్లో అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ విషయాలపై విజయ్ గానీ, త్రిష గానీ ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు.ప్రస్తుతం సంగీత తిరిగి కుటుంబంలో చేరారనే ప్రచారం నేపథ్యంలో, గతంలో వచ్చిన ఆ పుకార్లకు కూడా తెరపడినట్లేనని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.