Vijay – Rashmika | కొన్నాళ్లుగా టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన రూమర్డ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందానా ఎట్టకేలకు ఈ ఏడాది నిశ్చితార్థంతో ఒక్కటైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిశ్చితార్థాన్ని ఇరు కుటుంబాల మధ్య చాలా గోప్యంగా నిర్వహించినట్లు ప్రచారం జరుగుతుండగా, ఈ విషయాన్ని ఇప్పటివరకు ఈ జంట అధికారికంగా ప్రకటించలేదు. ‘గీత గోవిందం’ సినిమా షూటింగ్ సమయంలో మొదలైన పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని, అప్పటి నుంచే ఇద్దరూ రిలేషన్లో ఉన్నారనే వార్తలు ఇండస్ట్రీలో విస్తృతంగా వినిపించాయి.
విజయ్, రష్మిక కలిసి వెకేషన్లకు వెళ్లడం, పలు సందర్భాల్లో ఒకే లొకేషన్లో కనిపించడం, ఒక్కొక్కసారి మీడియా కంటపడడం వంటి ఘటనలతో వీరి బంధంపై అభిమానుల్లో స్పష్టత ఏర్పడింది. న్యూయార్క్‌లో జరిగిన ఇండిపెండెన్స్ వేడుకల్లో కూడా ఈ జంట కలిసి సందడి చేయడం అప్పట్లో మరింత చర్చకు దారితీసింది. అయినప్పటికీ, ఏ సందర్భంలోనూ తమ రిలేషన్‌ను ఓపెన్‌గా ప్రకటించకుండా ఇద్దరూ మౌనమే పాటించారు. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వారిద్దరు రోమ్ కి వెళ్లారు. రోమ్ లో సింగిల్ గా దిగిన పలు ఫోటోలను ఇద్దరూ తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. ఇద్దరూ ఒకే లొకేషన్స్ లో దిగిన ఫొటోలు షేర్ చేయడం, రష్మిక ఆనంద్ దేవరకొండ తో దిగిన ఫోటో షేర్ చేయడంతో విజయ్ – రష్మిక ఫ్రెండ్స్, కజిన్స్ తో ఈ వెకేషన్ కి వెళ్లినట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఓ స్టూడెంట్స్ మీటింగ్‌లో తాను విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుంటానని రష్మిక స్పష్టంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ జంట ఎప్పుడు పెళ్లి పీటలెక్కుతుందన్న ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. సోషల్ మీడియా కథనాల ప్రకారం 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందానా వివాహం జరగబోతుందని సమాచారం. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉండగా, ఇది కేవలం ప్రచారమా లేక త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందా అనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా కొత్త ఏడాదిలో ఈ స్టార్ జంట పెళ్లి బంధంతో ఒక్కటవుతారని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.