Vijay-Puri |కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం మొదటి నుంచే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన వెంటనే టైటిల్ టీజర్ విడుదలవుతుందని ప్రచారం జరిగినా, అనుకోని కారణాలతో అది వాయిదా పడింది. ఆ తర్వాత అధికారిక అప్డేట్స్ లేకపోవడంతో సినిమా చుట్టూ ఉత్కంఠ మరింత పెరిగింది. తాజా సమాచారం ప్రకారం షూటింగ్ పూర్తయి, త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సినిమాపై మొదటి నుంచి కథ, పాత్రల గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం, విజయ్ సేతుపతి ఈ చిత్రంలో బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారని టాక్. స్లమ్ నేపథ్యంగా సాగే ఈ కథలో ఒక కాలనీలోని జీవన విధానం, అక్కడి సంఘర్షణలే ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టబు పోషిస్తున్న పాత్ర కథకు కీలకంగా మారనుందని సమాచారం.
విజయ్ సేతుపతి పాత్రకు మూడు విభిన్న కోణాలు ఉంటాయని, అందులో ఒక కోణంలో నెగిటివ్ షేడ్స్ కూడా కనిపిస్తాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. బిచ్చగాడిగా కనిపించే వ్యక్తి వెనుక దాగి ఉన్న అసలు కథే సినిమాకు ప్రధాన బలమని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు మొదట ‘బెగ్గర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఓ ప్రెస్ మీట్లో ఆ ప్రచారాన్ని విజయ్ సేతుపతే ఖండించారు. ప్రస్తుతం ఈ మూవీకి ‘స్లమ్ డాగ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. టబుతో పాటు కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, పూరీ కనెక్ట్స్‌తో పాటు బేబీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పూరీ జగన్నాథ్‌తో కలిసి చార్మి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘ఉప్పెన’ తర్వాత విజయ్ సేతుపతి మరో తెలుగు సినిమాకు ఒప్పుకోకపోవడం తెలిసిందే. అలాంటి ఆయన పూరీ చెప్పిన కథకు ఒక్క సిట్టింగ్‌లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ సినిమాపై అంచనాలను పెంచింది. మరోవైపు గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేకపోయిన పూరీ జగన్నాథ్‌కు ఈ సినిమా కమ్ బ్యాక్‌గా మారుతుందన్న ఆశ అభిమానుల్లో బలంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్, హీరోకు భిన్నమైన పాత్ర నేపథ్యంతో ఈ ప్రాజెక్ట్‌పై మూవీ లవర్స్ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. త్వరలోనే టైటిల్, టీజర్‌తో పాటు ఇతర అప్డేట్స్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటివరకు ఈ కాంబోపై ఆసక్తి మరింత పెరుగుతూనే ఉంది.